జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు.. కోవిడ్ కార‌ణంగా అధికారుల‌కు పెద్ద స‌వాల్‌..!

-

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. డిసెంబ‌ర్ 1న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అందుకుగాను రాజ‌కీయ పార్టీల‌న్నీ సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో తెరాస ఒక అడుగు ముందే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికే సిట్టింగ్‌ల‌కు దాదాపుగా అన్ని స్థానాల‌ను తెరాస ఖ‌రారు చేసిన‌ట్లు తెలిసింది. కేవ‌లం కొన్ని కొత్త ముఖాలు మాత్ర‌మే ఈసారి తెరాసలో క‌నిపించ‌నున్నాయి. అయితే జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ఏమోగానీ.. కోవిడ్ నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం అధికారుల‌కు స‌వాల్‌గా మారింది.

big challenge to conduct ghmc election for officials in view of covid 19

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు బాగా న‌మోదైన స‌మ‌యంలో నిజానికి జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. రాను రాను కేసుల సంఖ్య త‌గ్గి ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో కేసులు ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి. త‌రువాత ఇప్పుడు కేసుల సంఖ్య అంత‌గా లేదు. కానీ ఎన్నిక‌లు అంటే మాట‌లు కాదు క‌దా.. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం కొన్ని సంద‌ర్భాల్లో క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంటుంది. అందువల్ల అధికారులే కాదు, అటు ప్ర‌జ‌లు, ఇటు పార్టీల‌కు ఎన్నిక‌లు క‌త్తి మీద సాములా మార‌నున్నాయి.

అయితే అన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తూ ప‌క‌డ్బందీగా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించినా.. జీహెచ్ఎంసీలో ఓట‌ర్లు మ‌హా బ‌ద్ద‌కిస్టులు. క‌నుక పోలింగ్ ఎప్పుడూ 50 శాతానికి మించ‌డం లేదు. 2009 జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కేవ‌లం 42.03 శాతం మాత్ర‌మే పోలింగ్ న‌మోదైంది. అలాగే 2016లో 45.09 శాతం మంది ఓట్లు వేశారు. దీన్ని బ‌ట్టి చూస్తే న‌గ‌ర వాసుల‌కు స‌మ‌స్య‌లు ఉంటే సోష‌ల్ మీడియా వేదిక‌గా గ‌ళాన్ని వినిపించ‌డం తెలుస్తోంది కానీ.. త‌మ‌కు స‌మ‌స్య‌ల‌ను లేకుండా చేసే నాయ‌కుల‌ను ఎన్నుకోవ‌డంలో వారి గొంతులు మూగ‌బోతున్న‌ట్లు క‌నిపిస్తుంది.

అయితే రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం మాత్రం ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అనేక మార్గాల‌ను య‌త్నించ‌నుంది. అవ‌స‌రం అయితే సెల‌బ్రిటీల‌తో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించే అవ‌కాశం లేక‌పోలేదు. అయిన‌ప్ప‌టికీ పోలింగ్ శాతం పెరుగుతుందా అన్న‌ది ఎన్నిక‌ల అధికారుల‌కు ప్ర‌తి సారీ సందేహంగానే మారుతోంది.

ఇక ఎన్నిక‌ల సంద‌ర్భంగా అభ్య‌ర్థుల నామినేష‌న్ల ప‌ర్వం మొదలుకొని ప్ర‌చారం, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు వ‌ర‌కు అన్ని చోట్ల ప‌క‌డ్బందీగా కోవిడ్ జాగ్ర‌త్త‌లు పాటించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోనున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఎన్నిక‌లు ఓవైపు క‌రోనా ప‌రంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకోవ‌డంతోపాటు తెరాస‌కు దుబ్బాక ఓట‌మి త‌రువాత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. మ‌రి ముందు ముందు ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుందో, ఎన్నిక‌ల్లో ఎలాంటి ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయో.. వేచి చూస్తే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news