ఎడిట్ నోట్ : అటు ఛాయ్ వాలా ఇటు ఆటోవాలా

-

సామాన్య స్థాయి నుంచి ఎదిగివ‌చ్చిన ఏక్ నాథ్ శిందే (శివ‌సేన తిరుగుబాటు నేత ) .. సామాన్య కుటుంబం నుంచి వ‌చ్చిన నరేంద్ర మోడీ (దేశ ప్ర‌ధాని) ఇద్ద‌రికీ కొన్ని పోలిక‌లు ఉన్నాయి. పార్టీ లు వేర‌యినా వీరి రాజ‌కీయ ప్ర‌స్థానాలు అతి సామాన్య కార్య‌క‌ర్త నుంచే మొద‌లు అయ్యాయి. వీరికి పెద్ద‌గా ధ‌నవంతులు అన్న పేరు లేదు.  ఇప్పుడున్న కొంద‌రి మాదిరిగా ఏ పేరొందిన కార్పొరేట్ శ‌క్తుల అండ‌దండ‌లూ లేవు. రాజకీయంగా ఒక్కో మెట్టు ఎక్కి పైకెక్కి వ‌చ్చిన వీరిద్ద‌రూ అటు రాజ‌కీయాల‌నూ ఇటు దేశ ప్ర‌గ‌తినీ ప్ర‌భావితం చేసే స్థానాల్లో ఉన్నారు. అటు ఛాయ్ వాలా ఇటు ఆటోవాలా ఓ విధంగా సామాన్య కుటుంబాల‌ను ఎంత‌గానో ప్ర‌భావితం చేయ‌గ‌లిగిన శ‌క్తులే కావ‌డం విశేషం. అధికారంలో ఉన్నంత కాలం ఏక్ నాథ్ శిందే ప్ర‌జ‌ల కోసం  వారి బాగోగుల కోసం ఆలోచిస్తే చాలు. అప్పుడు నిన్న‌టి ఆక‌లి బాధ‌లు అన్న‌వి సామాన్యుల‌కు తొల‌గిపోతాయి.  కుర్చీల కొట్లాట, ప‌ద‌వుల దేవులాట ఇక‌పై ఆగిపోతే చాలు.. మిగిలి ఉన్న ఈ కొద్ది రోజుల ప‌ద‌వీ కాలాన్నీ స‌ద్వినియోగం చేసుకుంటే ఆయ‌న అనుకున్న విధంగా ఆర్థిక రాజ‌ధాని, ఆయ‌నపై ఆశ‌లు పెట్టుకున్న ప్ర‌జ‌లు అనుకున్న ఆర్థిక రాజ‌ధాని పురోగ‌తి సాధించ‌డం ఖాయం.

గ‌త కొన్ని రోజుల నుంచి ముంబ‌యి తీరాన ప్ర‌శాంత‌ల‌కు నెల‌వుగా రాజ‌కీయ ప‌రిణామాలు లేవు. ఎవ‌రి వ్యూహం వారిది..ఎవరి దాహం వారిది అన్న విధంగానే న‌డిచేయి. ఆఖ‌రికి శివ‌సేన తిరుగుబాటు గుంపున‌కు సార‌థ్యం వ‌హించిన ఏక్ నాథ్ శిందే ను సీఎం ప‌ద‌వి  వ‌రించింది. అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో ఓ ఆటోవాలాను అదృష్టం వ‌రించ‌డంతో ఇప్పుడంతా కాస్త కాదు కొంచెం ఎక్కువ‌గానే ఆయ‌న‌పై ఫోక‌స్ పెడుతున్నారు. తొలుత అనుకున్న విధంగా బీజేపీ నేత, మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కు ఈ అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అంతా భావించినా, ఆఖ‌రి నిమిషాన అన్నీ మారిపోయాయి. బీజేపీ అధిష్టానం కూడా రాజ‌కీయ అస్థిర‌త‌లు వ‌ద్ద‌ని అనుకుందే ఏమో కానీ ఓ విధంగా ఏక్ నాథ్ ను సీఎం చేయ‌డం బీజేపీకి క‌లిసివ‌స్తుంది. ఇదే సంద‌ర్భాన దేవేంద్ర‌ను డిప్యూటీ సీఎం ప‌ద‌వికే ప‌రిమితం చేయ‌డం కూడా బాగుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

వాస్త‌వానికి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కే సీఎం కుర్చీ ద‌క్కాల్సి ఉంది. ఆయ‌న అయితేనే యోగ్యుడు ఆ ప‌ద‌వికి అన్న వాద‌న కూడా వినిపించింది. గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన దాఖ‌లాలు ఉన్నాయి. అయితే ఓటు బ్యాంకు రాజ‌కీయాలు, సుస్థిర వాదాలు క‌లిసి ఆయ‌న్ను డిప్యూటీ సీఎం కుర్చీకే ప‌రిమితం చేయ‌డం అమిత్ షా వ్యూహంలో ఒక‌టి. బీజేపీకి ఈ ప‌రిణామాలు అన్నీ బాగానే క‌లిసి రావ‌డంతో ప‌దవి ఏద‌యినా స‌రే ముందు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు  అన్న‌ది కీల‌కం అయి ఉండాల‌ని అధినాయ‌క‌త్వం భావించింది. రేప‌టి నుంచి బీజేపీ జాతీయ సమావేశాలు హైద్రాబాద్ కేంద్రంగా మొద‌లుకానున్నందున ఓ విధంగా హై క‌మాండ్ కు ఇది ఒక బిగ్ రిలీఫ్ పాయింట్ .

Read more RELATED
Recommended to you

Latest news