ఏపీలో టీడీపీ ఖేల్ ఖ‌త‌మే… ఇంత ఘోరంగా…

-

‘గతమెంతో ఘనం.. ప్రస్తుతం అథమం’ అనే చందానా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ తయారవుతుంది. ఒకప్పుడు తిరుగులేని పార్టీగా ఉన్న టీడీపీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. తెలంగాణలో ఎలాగో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. అక్కడి నేతలు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఇక అడుగుబొడుగు మిగిలిన వారు కూడా తమ గూటిని వెతుక్కునే పనిలో ఉన్నారు. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో టీడీపీ మొన్నటివరకు బలంగానే ఉంది. కానీ ఎన్నికల్లోఘోర ఓటమి తర్వాత పరిస్తితులు ఒక్కసారిగా తారుమారైపోయాయి.

ఆ పార్టీ ఎప్పుడు లేని విధంగా 23 సీట్లకే పరిమితమైంది. ఎప్పుడు అయితే పార్టీ ఓటమి పాలైంది. అప్పటి నుంచి నేతలు జంప్ అవ్వడం మొదలుపెట్టారు. బీజేపీ ఆపరేషన్ కమలంలో భాగంగా చాలామంది ఆ పార్టీలో చేరిపోయారు. ఇక తాజాగా మరికొందరు ముఖ్యనేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో టీడీపీకి భవిష్యత్ లేదని భావిస్తున్న ఆ నేతలు వైసీపీ, బీజేపీల్లోకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లా నేత వరుపుల రాజా టీడీపీకి గుడ్ బై చెప్పేశారు.

మొన్న ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి ఓటమి పాలైన రాజా వైసీపీ చేరనున్నారని తెలుస్తోంది. ఇక వెళుతూ వెళుతూ ఆయన టీడీపీ మీద గట్టిగానే విమర్శలు చేశారు. టీడీపీలో కాపులకు న్యాయం జరగలేదని అన్నారు. జగన్ కాపులపై ఒకటే స్టాండ్ తీసుకున్నారని ప్రశంసించారు. ఆ తర్వాత ఇదే జిల్లాకు చెందిన సీనియర్ నేత, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా పార్టీ వీడతారని తెలుస్తోంది. 2014లో వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చిన నెహ్రూ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

అటు విశాఖపట్నంలో కూడా టీడీపీలోని పలువురు ముఖ్య నేతలు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. మొన్న ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఓడిపోయిన టీడీపీ నేత ఆడారి ఆనంద్ కుమార్ పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. విశాఖ మిల్క్ డెయిరీ చైర్మన్ అయిన ఆడారికు రైతుల్లో మంచి పట్టుంది. అందుకే ఈయనపై వైసీపీ గురి పెట్టింది. ఆడారి కూడా వైసీపీలోకి వెళ్ళేందుకు సుముఖంగానే ఉన్నారు. అటు ఆడారి సోదరి ఎలమంచిలి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ 1న విజయవాడలో జగన్‌ సమక్షంలో వీరు వైసీపీలో చేరుతారని తెలుస్తోంది.

అలాగే విశాఖ జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ మారేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. గంటా వైసీపీలోకి రావటానికి రూట్ క్లియర్ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, గంటా చేరిక పైన ఆయన మాజీ స్నేహితుడు..ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస రావు నుండే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో..వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి రంగంలోకి దిగి..గంటా రాకకు మార్గం సుగమం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే గంటా టీడీపీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news