చైనావ‌న్నీ అబ‌ద్దాలే.. సాక్ష్యాల‌ను మాయం చేసింది..!

-

కరోనా వైర‌స్ ప‌ట్ల చైనా మొద‌ట్నుంచీ అనుమానాస్ప‌ద వైఖ‌రిని అవ‌లంబిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే వైర‌స్ త‌మ వ‌ద్ద పుట్ట‌లేద‌ని కూడా మొద‌ట్నుంచీ చైనా వాదిస్తోంది. ఇక తాము ఈ విష‌యంలో పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని, త‌మ వ‌ద్ద ఉన్న స‌మాచారాన్ని ప్ర‌పంచ దేశాల‌తో పంచుకుంటున్నామ‌ని కూడా చైనా చెబుతూ వ‌స్తోంది. అయితే నిజానికి చైనా ప్ర‌పంచ దేశాల‌కు చెబుతున్న‌వ‌న్నీ అబ‌ద్దాలేన‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర దేశాల‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని చైనా ఇవ్వ‌లేద‌ని, అంతేకాకుండా వైర‌స్ అక్క‌డే పుట్టింద‌న్న వివ‌రాల తాలూకు సాక్ష్యాల‌ను కూడా చైనా మాయం చేసింద‌ని.. వెల్ల‌డైంది. ఈ మేర‌కు అమెరికా, కెన‌డా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు 15 పేజీల డాక్యుమెంట్‌ను సిద్ధం చేశాయి. ఈ వివ‌రాల‌ను ది స‌న్ అనే ఓ మీడియా వెబ్‌సైట్ వెల్లడించింది.

china lied to world about corona virus destroyed proofs

క‌రోనా వైర‌స్ మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కు వ్యాపించ‌ద‌ని మొద‌ట చైనా చెప్ప‌గా.. అటు వ‌రల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ (డ‌బ్ల్యూహెచ్‌వో) కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించింది. ఆ త‌రువాత 2 వారాల‌కు ఈ వైర‌స్ మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కు వ్యాపిస్తుంద‌ని చెప్పారు. అయితే అప్ప‌టికే స‌మ‌యం మించిపోయింది. చైనా నుంచి పెద్ద ఎత్తున వైర‌స్ వ్యాప్తి చెందిన ఇత‌ర దేశాల వారు త‌మ త‌మ దేశాల‌కు వెళ్లిపోయారు. దీంతో వైర‌స్ ఒక్క‌సారిగా విజృంభించింది. అయితే చైనా, వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్‌లు ముందుగానే స‌రైన స‌మాచారం ఇచ్చి ఉంటే.. ప్ర‌పంచ దేశాలు ముందే అల‌ర్ట్ అయ్యేవ‌ని.. ది స‌న్ వెల్ల‌డించింది.

ఇక చైనాలోని వూహాన్ ల్యాబ్‌లో గ‌బ్బిలాల్లో ఉండే వైర‌స్‌ల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయని, దీంతో అక్క‌డి నుంచే ఆ వైర‌స్ వ్యాపించింద‌ని, అయితే ఈ విష‌యాన్ని దాచి పెట్టిన చైనా ఆ సాక్ష్యాల‌ను కూడా మాయం చేసింద‌ని ది స‌న్ ఆరోపించింది. అలాగే ఈ వైర‌స్‌పై మాట్లాడిన అక్క‌డి జ‌ర్న‌లిస్టులు, డాక్ట‌ర్లను కూడా జైలులో ప‌డేశార‌ని మండిప‌డింది. దీంతోపాటు అక్క‌డ వూహాన్ సీఫుడ్ మార్కెట్‌, వూహాన్ అన్‌నౌన్ న్యుమోనియా, సార్స్ వేరియేష‌న్ వంటి అంశాల‌పై అక్క‌డి పౌరులు ఇంట‌ర్నెట్‌లో సెర్చ్ చేయ‌కుండా చైనా ఆంక్ష‌లు విధించింద‌ని కూడా ది స‌న్ తెలిపింది.

కాగా వైర‌స్ సోకిన వ్య‌క్తుల‌కు చెందిన శాంపిళ్ల స‌మాచారాన్ని చైనా ఇత‌ర దేశాల‌తో పంచుకోలేద‌ని, దీంతో వ్యాక్సిన్ త‌యారీకి ఇత‌ర దేశాల సైంటిస్టులు చేస్తున్న ప్ర‌యోగాలు విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని ది స‌న్ తెలిపింది. అయితే స‌ద‌రు 15 పేజీల డాక్యుమెంట్‌తో చైనాకు వ్య‌తిరేకంగా కేసు దాఖ‌లు చేసే అవ‌కాశం కూడా ఇత‌ర దేశాల‌కు ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఈ విష‌యంలో అగ్ర‌రాజ్యం అమెరికా ఎలా ముందుకు సాగుతుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news