కోవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌ధాని మోదీ పాపులారిటీని త‌గ్గిస్తోందా..?

-

దేశ‌వ్యాప్తంగా కరోనా క‌రాళ నృత్యం చేస్తోంది. మొద‌టి వేవ్ క‌న్నా సెకండ్ వేవ్ మ‌రింత ఉధృతంగా ఉంది. గ‌త వారం రోజులుగా రోజుకు 3.50 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. శ‌నివారం ఒక్క రోజే 4 ల‌క్ష‌ల కొత్త కేసులు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో మే మ‌ధ్య వర‌కు రోజు వారీ కోవిడ్ కేసుల సంఖ్య 10 ల‌క్ష‌ల‌కు చేరుకుంటుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. అయితే క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌ధాని మోదీ పాపులారిటీని త‌గ్గిస్తుందా ? అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

does pm modi popularity down because of covid second wave

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో రిజైన్‌మోదీ అనే హ్యాష్ ట్యాగ్ వైర‌ల్ అయింది. 14 కోట్ల మంది ప్ర‌జ‌లు చాలా స్వ‌ల్ప స‌మ‌యంలో మోదీ రాజీనామా చేయాల‌ని హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. దీన్ని బ‌ట్టి చూస్తే కేంద్రంపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హంగా ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రో వైపు సుప్రీం కోర్టు కూడా క‌రోనాను అదుపు చేయ‌లేక‌పోతున్నారంటూ కేంద్రంపై విమ‌ర్శ‌లు చేసింది. అనేక దేశాల్లో ఇప్ప‌టికే కోవిడ్ సెకండ్‌, థ‌ర్డ్ వేవ్ లు కూడా వ‌చ్చిపోయాయి. అయితే అందుకు భార‌త్ ఏమీ మిన‌హాయింపు కాదు. అస‌లే క‌రోనా, దానికి పేద‌, ధ‌నిక అనే తేడా లేదు. పేద దేశం, ధ‌నిక దేశం అన్న భావ‌న లేదు. క‌నుక భార‌త్‌లోనూ కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉంటుంద‌ని నిపుణులు ముందే హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ కేంద్రం ప‌ట్టించుకోలేద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఓ వైపు కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న‌ప్ప‌టికీ దేశంలో ఆంక్ష‌ల‌ను దాదాపుగా తొల‌గించ‌డం, అన్నీ య‌థావిధిగా న‌డ‌వడం, ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం, ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. వంటివ‌న్నీ జ‌రిగాయి. దీని వ‌ల్ల పుట్ట‌లోంచి చీమ‌లు ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు కోవిడ్ దేశంలో వెద‌జ‌ల్ల‌బ‌డింది. ఫ‌లితంగా భారీ ఎత్తున కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇంత జ‌రుగుతున్నా కేంద్రం లాక్‌డౌన్ విధించ‌క‌పోవ‌డం, ఆ నిర్ణ‌యాన్ని రాష్ట్రాల‌కే వదిలేయడం, వ్యాక్సిన్లు, వైద్య స‌దుపాయాల కొర‌త ఏర్ప‌డ‌డం, సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు త‌మ గోడును వెళ్ల‌బోసుకుంటుండ‌డం వంటివ‌న్నీ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే విష‌యాలే.

అయితే ఇన్ని ప్ర‌తికూల‌త‌లు ఉండ‌డంతోపాటు రానున్న రోజుల్లో కోవిడ్ మ‌రింత విజృంభించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తున్న‌ప్ప‌టికీ కేంద్రం ఆ దిశ‌గా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం, కేవలం జాగ్ర‌త్త‌లు పాటించండి అని చెప్ప‌డం వ‌ర‌కే ప‌రిమితం కావ‌డం ప్ర‌జ‌ల్లో ఇంకా ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. వైద్య స‌దుపాయాల‌ను మెరుగు ప‌ర‌చ‌డం, కోవిడ్ క‌ట్ట‌డికి అడ్డుకట్ట వేసేందుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లను తీసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కేంద్రం ఇంకా విమ‌ర్శ‌ల పాలు అవుతోంది. దీంతో ప్ర‌ధాని మోదీ పాపులారిటీ కూడా క్ర‌మంగా త‌గ్గుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ముందు ముందు ఇంకా ఎలాంటి ప‌రిణామాలు ఏర్ప‌డుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news