రెండు రోజుల క్రితం తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాకుండా, అధికార టీఆర్ఎస్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈటెల ఇప్పుడు కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకునే ఈ వ్యాఖ్యలు చేశారన్న విషయం అందరికి స్పష్టంగా తెలుస్తోంది. ఈటెలను కొద్ది రోజులుగా కేసీఆర్ కేబినెట్ నుంచి తప్పించేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. పేరుకు మాత్రమే ఆయన ఆర్థికమంత్రిగా ఉన్నారని.. కానీ ఆ శాఖలో పెత్తనం అంతా కేసీఆర్ చేస్తున్నారన్న గుసగుసలు టీ పాలిటిక్స్‌లో ఉన్నాయి.
ఇక తాజాగా వినోద్‌కుమార్‌కు ప్రణాళికా సంఘం అధ్యక్షుడి పదవి ఇవ్వడంతో వినోద్ కూడా ఆ శాఖలో వేలు పెట్టవచ్చన్న సందేహాలు కూడా కొందరికి ఉన్నాయి. ఇక ఈ సందేహాలు ఎలా ? ఉన్నా తాజాగా మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన వ్యాఖ్యలు ఈటెలకు కౌంటర్ ఇచ్చినట్లుగానే ఉన్నాయన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుఊ ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే ఓనర్ అని.. ఆ జెండాను తయారు చేసింది కూడా కేసీఆరే అని అన్నారు. అంతకు ముందు ఈటెల తాను కూడా గులాబీ జెండా రూపకర్తనే అని చెప్పిన సంగతి తెలిసిందే. అదే టైంలో ఎర్రబెల్లి ఆ మాటను కౌంటర్ చేస్తూ గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే బాస్ అని చెప్పడంతో అది ఈటెలకు స్పష్టంగా కౌంటర్‌గా ఉన్నట్లే ఉంది.
ఈటెల రాజేందర్ అంశం సమసిపోయిందని, ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో తాను టీడీపీలో ఉన్నానన్న ఎర్రబెల్లి ఉద్యమానికి అనుకూలంగా లేఖ కూడా ఇప్పించానని.. గుర్తు చేశారు. ఎర్రబెల్లి పార్టీలో చాలా జూనియర్ అలాంటిది ఆయన ఈటల పదవికి వచ్చిన డోకా లేదని చెప్పడం కూడా ఏదో తేడా కొడుతుందనే సంకేతాలు పార్టీలోకి వెళ్లేలా చేసింది. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా ? కంటిన్యూ అవుతుందా ? అన్నది చూడాలి.