సాధారణంగా ఎన్నికల పోలింగ్‌లో ఓటింగ్ సరళి ఎలా ఉంది, వారు ఎవరికి ఓటు వేశారు.. అన్నవివరాలను ఆధారంగా చేసుకుని మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటిస్తుంటాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి అంచనాలు మాత్రమే. ఆ ప్రకారం ఫలితాలు రావచ్చు, రాకపోవచ్చు.
మరో 4 రోజులు.. అంతే.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు, అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతాయి. గెలుపు ఎవరిదో తెలిసిపోతుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, ఏ పార్టీని ప్రజలు తిరస్కరిస్తారో కూడా తెలుస్తుంది. అయితే అసలైన ఎన్నికల ఫలితాలు రాకముందే సర్వే, మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా రానున్నాయి. చివరి దశ ఎన్నికల పోలింగ్ ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ముగుస్తుంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.
అయితే ఎగ్జిట్ పోల్స్ ఏమో గానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పే ఎగ్జిట్ పోల్స్ పట్ల జనాలు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో కారుకు, ఏపీలో సైకిల్‌కు మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పారు. కానీ ఎవరికెన్ని సీట్లు వస్తాయో చెప్పలేదు. ఇవాళ సాయంత్రం రాజగోపాల్ ఆ వివరాలను వెల్లడిస్తానన్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను రాజగోపాల్ చెబుతారు సరే.. అసలాయన సర్వే నిజంగానే చేయించారా..? ఆయన చెప్పే ఎగ్జిట్ పోల్స్ ను నమ్మవచ్చా..? అంటే.. నమ్మలేమని.. చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.
సాధారణంగా ఎన్నికల పోలింగ్‌లో ఓటింగ్ సరళి ఎలా ఉంది, వారు ఎవరికి ఓటు వేశారు.. అన్నవివరాలను ఆధారంగా చేసుకుని మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటిస్తుంటాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి అంచనాలు మాత్రమే. ఆ ప్రకారం ఫలితాలు రావచ్చు, రాకపోవచ్చు. నిజానికి ఆ ఫలితాలు లాటరీ లాంటివి. కొందరు కొన్ని రకాలుగా ఎగ్జిట్ పోల్స్ చెబితే.. మరికొందరు కొన్ని రకాలుగా ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటిస్తారు. ఈ క్రమంలో ఫలితాలు ఏవో కొన్ని ఎగ్జిట్ పోల్స్‌కు ఎలాగూ దగ్గరగానే ఉంటాయి. కానీ తమ ఫలితాలే నిజమయ్యాయని చెప్పి బాకా వేసుకునే సంస్థలు చాలానే ఉన్నాయి. అయితే అలాంటి సంస్థలు కూడా ఒక్కోసారి ప్రకటించే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారు అవుతుంటాయి. అవును, ముందే చెప్పాం కదా.. అవి అంచనాలు మాత్రమేనని. అందుకనే అంచనాలు తప్పితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా తారుమారు అవుతుంటాయి. సరిగ్గా లగడపాటి రాజగోపాల్ కు జరిగిందదే. అందుకనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేడా కొట్టాయి. లగడపాటి చెప్పింది అబద్ధమైంది.
తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి వస్తుందని లగడపాటి చెప్పారు. అయినా అది నిజం కాలేదు. ప్రజలు మళ్లీ కారు గుర్తుకే ఓటు వేశారు. అందుకనే టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ లగడపాటి రాజగోపాల్ మీడియా ముందుకు వచ్చి ఈసారి సర్వే ప్రకారం ఏపీలో టీడీపీయే వస్తుందని చెప్పారు. మరి ఈ సారి లగడపాటి చెప్పిందే నిజమవుతుందా..? అంటే.. కాకపోవచ్చు.. ఎందుకంటే.. ప్రీపోల్ సర్వేలే కాదు, ఇప్పటికే రెడీగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు వైసీపీయే అధికారంలోకి వస్తుందని తేల్చేశాయి. మెజారిటీ సర్వేలన్నీ వైసీపీకే అనుకూలంగా ఉన్నప్పుడు టీడీపీయే అధికారంలోకి వస్తుందని చెప్పడం నిజంగా హాస్యాస్పదమే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలప్పుడు కూడా కేవలం కొన్ని గంటల్లోనే మాట మార్చి మొదట టీఆర్ఎస్ అని తరువాత మహాకూటమి అని లగడపాటి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించి నవ్వుల పాలయ్యారు. ఇప్పుడు కూడా అదే కోవలో ప్రయాణిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మరి లగడపాటి ఈ సారి చెప్పింది నిజమవుతుందా, కాదా అనే వివరాలు తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు..!