ప్ర‌జావేదిక నేల‌మ‌ట్టం.. త్వ‌ర‌లో చంద్ర‌బాబు నివాసం కూడా..?

-

నిన్న రాత్రి నుంచి అక్ర‌మ నిర్మాణాల్లో ఒక‌టైన ప్ర‌జావేదిక‌ను కూల్చివేసే కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టారు. మ‌రికొన్ని గంట‌ల్లో ఆ ప్ర‌క్రియ పూర్తి కానుంది. అయితే అదే ప్రాంతంలో ఉన్న చంద్ర‌బాబు నివాసాన్ని కూడా త్వ‌ర‌లో కూల్చివేయ‌నున్న‌ట్లు తెలిసింది.

ఏపీకి సీఎం అయిన‌ప్ప‌టి నుంచి వైఎస్ జ‌గ‌న్ ఆ రాష్ట్రంలో పాల‌న‌ను ప‌రుగెత్తిస్తున్నారు. వైఎస్ ఆస‌రా ఫించ‌న్ల‌పై త‌న తొలి సంత‌కాన్ని పెట్టిన‌ప్పటి నుంచి అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లులో, పాల‌న‌లో చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కృష్ణా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలోని క‌ర‌క‌ట్ట‌పై నిర్మించిన అక్ర‌మ నిర్మాణాల‌పై కూడా కొర‌డా ఝులిపిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న రాత్రి నుంచి స‌ద‌రు అక్ర‌మ నిర్మాణాల్లో ఒక‌టైన ప్ర‌జావేదిక‌ను కూల్చివేసే కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టారు. మ‌రికొన్ని గంట‌ల్లో ఆ ప్ర‌క్రియ పూర్తి కానుంది. అయితే అదే ప్రాంతంలో ఉన్న చంద్ర‌బాబు నివాసాన్ని కూడా త్వ‌ర‌లో కూల్చివేయ‌నున్న‌ట్లు తెలిసింది.

మ‌న దేశంలో జ‌ల‌వ‌న‌రుల‌ను ప‌రిర‌క్షించాలనే ఉద్దేశంతో అప్ప‌ట్లో సుప్రీం కోర్టు న‌దులు, న‌దీగ‌ర్భాలు, వాటి ప‌రివాహ‌క ప్రాంతాల్లో కాంక్రీటు క‌ట్ట‌డాల‌ను నిర్మించ‌కూడ‌ద‌ని ఆదేశించింది. అలాగే 1994లో ఎంసీ మెహ‌తా వ‌ర్సెస్ క‌మ‌ల్‌నాథ్ కేసులోనూ న‌దీ గ‌ర్భాల్లో క‌ట్ట‌డాలు అక్ర‌మ‌మేన‌ని ఆ కోర్టు తీర్పునిచ్చింది. ఈ క్ర‌మంలోనే అప్ప‌ట్లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని బియాస్ న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో కుప్ప‌లు కుప్ప‌లుగా పుట్టుకొచ్చిన అక్ర‌మ నిర్మాణాల‌పై సుప్రీం కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వెంట‌నే ఆ నిర్మాణాల‌ను తొల‌గించాల‌ని కోర్టు తీర్పునిచ్చింది.

అయితే ఆ కేసు విచార‌ణలో.. గాలి, నీరు, చెట్లు, న‌దులు, స‌ముద్రాలు ఏ ఒక్క‌రికీ సొంతం కావ‌ని, అవి మనుషులంద‌రికీ చెందుతాయ‌ని, అలాంటి స‌హజ వ‌న‌రుల‌ను ప‌రిర‌క్షించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంద‌ని కూడా సుప్రీం తెలిపింది. ఈ క్ర‌మంలోనే వాటి ప‌రిర‌క్ష‌ణ కోసం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, న‌దీ పరివాహ‌క ప్రాంతాల్లో, న‌దీ గ‌ర్భాల్లో ఎలాంటి కాంక్రీట్ నిర్మాణాలు చేప‌ట్ట‌కూడ‌ద‌ని సుప్రీం తీర్పు చెప్పింది. అయితే అదే తీర్పు ఇప్పుడు కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతంలో వెల‌సిన అక్ర‌మ నిర్మాణాల‌కూ వ‌ర్తిస్తుంద‌ని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

విజ‌య‌వాడ‌లోని కృష్ణా న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో మొత్తం 52 కాంక్రీట్ నిర్మాణాలు ఉన్నాయ‌ని, వాటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ 2016లో ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. అయితే ఆ కేసు విచార‌ణ కొన‌సాగుతుండ‌గా, ఆ నిర్మాణాల్లో కృష్ణా న‌ది క‌ర‌క‌ట్ట‌పై ఉన్న ప్ర‌జావేదిక, చంద్ర‌బాబు నివాసం కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్ర‌స్తుతం ప్ర‌జావేదిక కూల్చివేత‌కు లైన్ క్లియ‌ర్ అవ‌గా దాన్ని కూల్చివేసే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఇక మిగిలిన నిర్మాణాల‌కు చెందిన య‌జ‌మానులు త‌మ భ‌వంతుల‌ను కూల్చివేయకుండా గ‌తంలో స్టేలు తెచ్చుకున్నారు. అయితే అప్పుడు చంద్ర‌బాబు సీఎంగా ఉన్నారు క‌నుక‌.. ఆ నిర్మాణాల గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ ఆ నిర్మాణాల‌న్నీ అక్ర‌మ‌మైన‌వే గ‌నుక‌, ప్ర‌స్తుతం సీఎంగా జ‌గ‌న్ ఉన్నారు క‌నుక‌.. త్వ‌ర‌లోనే వాటిని కూడా కూలుస్తార‌ని, అలాగే చంద్ర‌బాబు నివాసాన్ని కూడా కూల్చివేస్తార‌ని తెలిసింది. మ‌రి జ‌గ‌న్ ఈ విష‌యంలోనూ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తారా..? స‌ద‌రు అక్ర‌మ నిర్మాణాల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారు..? అనే విష‌యాలు తెలియాలంటే.. మ‌రికొద్ది రోజుల వ‌ర‌కు వేచి చూడ‌క తప్ప‌దు..!

Read more RELATED
Recommended to you

Latest news