శభాష్‌… తెలంగాణ పోలీస్‌

-

అగ్నిజ్వాలల మధ్య విలవిలలాడిన ఓ ఆత్మకు శాంతి లభించింది. కోటానుకోట్ల ఆగ్రహావేశాలు చల్లారాయి. తక్షణ న్యాయం కోసం తల్లడిల్లిన దేశం ఊరడిల్లింది. పోలీసులపైనే తిరగబడే నైజం ఉన్న నరరూప రాక్షసులు చరిత్రలో కలిసిపోయారు. తెలంగాణ పోలీసులు తక్షణ న్యాయానికి కొత్త అర్థం చెప్పి హీరోలయ్యారు.

అక్కడ జరిగింది అభినందన సభ కాదు. జిందాబాద్‌లు కొట్టడానికి. హడావుడిగా తిరుగుతున్నది ప్రపంచకప్‌ గెలుచుకున్న ఇండియన్‌ టీమ్‌ కాదు. పూల వర్షం కురిపించడానికి. వివాహాది శుభకార్యాలు కాదు. స్వీట్లు తినిపించడానికి. పటాకులు కాల్చడానికి. కానీ, కనీవినీ ఎరుగని సత్కారం జరిగింది తెలంగాణ పోలీసులకి. పూలు, అభనందనల వర్షంలో తడిసిముద్దయిన పోలీసులు తన జీవితకాలంలో ఇటువంటి అభినందనలు పొందిఉండరు.

అక్కడ జరిగింది ఓ ‘ఎన్‌కౌంటర్‌’. దేశం మొత్తం కన్నీరు పెట్టిన ఓ దారుణాన్ని తలపెట్టిన నలుగురు ముష్కరులను తుదముట్టించిన ఓ ‘శుభకార్యం’.

రక్కసుల చేతికి చిక్కి, విలవిలలాడుతూ దేహం విడిచిన ఓ ఆత్మ నేటికి శాంతించింది. కమిషనర్‌ సజ్జనార్‌ ‘సర్‌’ ఆడపిల్లల పాలిటి ఆపద్బాంధవుడిగా అవతరించి, నేనున్నానంటూ తక్షణ‘న్యాయం’ చేసారు. నాడు వరంగల్‌లో, నేడు హైదరాబాద్‌లో ఇటువంటి కంటకుల పాలిటి కాలయముడయ్యాడు.

ఎ బిగ్‌ సెల్యూట్‌ టు  సజ్జనార్‌ సర్‌..

జరిగిన ఈ దారుణం పట్ల పోలీసులు కూడా మనోవేదనతో తల్లడిల్లారు. ఆ పోలీసులకు కూడా కూతుళ్లు ఉన్నారు కదా. అర్ఢగంట ఆలస్యమయితేనే అటూఇటూ తిరుగాడే తండ్రులలో వాళ్లూ ఉన్నారు కదా. తక్షణన్యాయం చేయాలని వాళ్లకూ ఉంటుంది. ప్రజలతో పాటు, పోలీసులు కూడా వాళ్లను తుదముట్టించాలని గాఢమైన కోపంతో ఉన్నారు. దేవుడు ఈ రోజు వారికా అవకాశం ఇచ్చాడు. వాళ్లు సద్వినియోగం చేసారు.

 

కానీ, ఇంకా ఇంతకంటే నీచులు సోషల్‌ మీడియాలో కుప్పలుతెప్పలుగా ఉన్నారు. అసలు ఫేస్‌బుక్‌లో 90శాతం ఇలాంటి పనిపాటాలేని పోరంబోకులే. అడ్డమైన ఫోటోలు, నీచమైన కామెంట్లతో తమ శాడిజాన్ని వెదజల్లుతున్నారు. దిశ రేప్‌ విడియోల కోసం 8 లక్షలమంది పోర్న్‌ సైట్లలో వెతికారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐదువేలకు ఓ చైనా స్మార్ట్‌ఫోన్‌, 200లకు 45జిబి డాటా ఉన్నందుకే అసలు ఈ సమస్యంతా. ఇంటర్‌నెట్‌లో విచ్చలవిడిగా లభించే బూతు విడియోల ప్రభావం సహజంగానే ఇటువంటి చదువు,సంస్కారం లేని పశువులపై ఉంటుంది. తెల్లవార్లూ దొరికే మందు ఎలాగూ ఉండనే ఉంది. ఇంకేం కావాలి ఒక ఆడపిల్ల జీవితం నాశనం కావడానికి?

పిల్లలను పెంచే పద్ధతులు నేటి తల్లిదండ్రులకు తెలియడంలేదు. లేదా ఆసక్తి, ఓపిక లేవు. ఆడపిల్లలతో ఎలా మెలగాలని మగపిల్లలకు, మగవాళ్లతో ఎలా ఉండాలో ఆడపిల్లలకు చిన్నప్పట్నుంచే నేర్పకపోవడం, గౌరవమర్యాదలంటే ఎలా ఉంటాయో చెప్పకపోవడం ఈ దారుణాలకు మూలకారణాలు. కల్చర్‌ పేరుతో బార్లలో, పబ్బుల్లో వీరవిహారం చేయడం నేటి ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇక్కడ ఆడామగా తేడాలు కూడా ఉండవు.

దేశంలోకి ఇటువంటి అశ్లీల చిత్రాలు రాకుండా అడ్డుకట్ట వేయాలి. ఇంటర్‌నెట్‌ ప్రవేశమార్గాలైన గేట్‌వేలలోనే వీటిని ఫిల్టర్‌ చేయాలి. సోషల్‌ మీడియాలో కూడా ఖాతా తెరవాలంటే బ్యాంకు ఖాతాలా అన్ని వివరాలు తీసుకోవాలి. ప్రతీవాడు పెట్టే ప్రతీ పోస్టుకు జవాబుదారీతనం ఉండాలి. లేకపోతే ఇదే విచ్చలవిడితనం ఇంకా పేట్రేగుతునేఉంటుంది.

ఇటువంటి మూలకారణాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టాలి. నేరం జరిగాక న్యాయం చేయడానికి కష్టపడాల్సిన అవసరం లేకుండా, అసలు నేరమే జరగకుండా ఉంటే అంతకంటే కావాల్సిందేముంది? మరోసారి….

జయహో… తెలంగాణ పోలీస్‌..

రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news