ప్రపంచ ‘రంగస్థలాన్ని’ ఏలాలి.. తండ్రిని మించిన తనయుడు రామ్‌ చరణ్‌

-

ప్రపంచ రంగస్థల దినోత్సం (మార్చి 27). రామ్ చరణ్ జన్మించింది కూడా అదే రోజు. అయితే రామ్ చరణ్ పుట్టినప్పుడు సహజంగానే ఉప్పొంగిపోయానంటూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు. అయితే ఆ రంగస్థలం తన జీవితాన్ని మార్చేసింది. రంగస్థల దినోత్సవం నాడు పుట్టి అదే రంగస్థలం సినిమాతో విమర్శకుల నోళ్లు మూయించాడు. ఇప్పటి వరకు ఆయన సినిమా ప్రయాణం ఎలా కొనసాగిందో ఓ సారి చూద్దాం.

చిరు తనయుడిగా చిరుత సినిమాతో రంగస్థల ప్రవేశం చేశాడు. అయితే ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ప్రమోషన్స్‌లోనూ కొత్త పంథాను సృష్టించింది. హీరో మొహాన్ని అప్పటి వరకు చూపించకుండా.. నేరుగా 70 ఎమ్ ఎమ్ స్క్రీన్‌పైనే అదిరిపోయేలా డిజైన్ చేశారు. అప్పటి వరకు ఉన్న హీరో ఇంట్రడక్షన్స్ వేరు అది వేరు అనేట్టు కంపోజ్ చేశారు. మొదటి చిత్రం కావడంతో మాస్ అంశాలు ఎక్కువగా ఉండాలని, మాస్ బేస్ ఉన్న పూరి జగన్నాథ్ చేతిలోపెట్టాడు చిరంజీవి. దాని సంపూర్ణ న్యాయం చేశాడు పూరి. మొదటి సినిమాలోనే డ్యాన్స్‌లు, ఫైట్స్‌లు ఇరగొట్టేసి అదరహో అనిపించాడు.

ఇక రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేశాడు రామ్ చరణ్. మగధీర వంటి చిత్రంలో శతదృవంశ యోధుడిగా కాళ భైరవ పాత్రలో జీవించేశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో చరణ్ తనకు తానే సాటి అనిపించుకున్నాడు. అయితే ఈ మూవీ విజయం సాధించడంలో దర్శకుడి పాత్రే ఎక్కువ అని, రామ్ చరణ్ షేర్ ఏమీ లేదని అప్పట్లో నెగెటివ్ స్ప్రెడ్ చేసినా.. రాజమౌళి మాత్రం సరి సమానమైన క్రెడిట్ ఇచ్చాడు.

మగధీర నుంచి రామ్ చరణ్‌కు ఓ రకంగా కష్టాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. మూడో సినిమా ఆరెంజ్ దారుణంగా బెడిసి కొట్టడం, ఆ దెబ్బకు నిర్మాత నాగబాబు ఆత్మహత్య చేసుకోవాలనేంత డిప్రెషన్‌లోకి వెళ్లడం కూడా జరిగింది. కొత్తగా ట్రై చేస్తే వర్కౌట్ కాలేదు.. కానీ మ్యూజిక్, రామ్ చరణ్ స్టైల్ అన్ని ఇంకా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. అయితే ఆ సినిమా ఇప్పుడు వస్తే ఫలితం వేరేలా ఉండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది.

రచ్చ, నాయక్, ఎవడు, బ్రూస్‌లీ వంటి సినిమాలు మూస ధోరణిలో వెళ్లాయని విమర్శలు వచ్చినా.. దాదాపు అన్నీ కూడా కమర్షియల్ సక్సెస్ సాధించినవే. ఒక్క బ్రూస్‌లీ చిత్రమే డిజాస్టర్‌గా మిగిలింది. రచ్చ, నాయక్ వంటి సినిమాలు మాస్ హీరోగా నిలబెట్టాయి. మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. పాటలు, ఫైట్స్ చేయడంలో మరింత రాటు దేలిపోయాడు. ఈ రెండు సినిమాల్లో యాక్షన్ మోతాదుతో పాటు డ్యాన్సులు కూడా హైలెట్‌గా నిలిచాయి.

తన జీవితంతో బ్రూస్‌లీ ఎంతో నేర్పిందని, ఆ సినిమాతో ఎలాంటి కథలు ఎంచుకోకూడదో తెలిసి వచ్చిందని మీడియా ముఖంగానే చెప్పుకొచ్చాడు. అందుకే కథలు ఎంచుకునే పంథాను మార్చేశానని తెలిపాడు. ఓ రకంగా చూస్తే ఆ సినిమా తరువాతే రామ్ చరణ్‌లో చాలా మార్పులు వచ్చాయి. మొట్టమొదటిసారిగా ఓ రీమేక్ కథకు ఓకే చెప్పాడు.

తని ఒరువన్ అంటూ తమిళనాటలో జయం రవ, అరవింద్ స్వామి చేసిన సినిమాను తెలుగులో ధృవ చిత్రంగా రీమేక్ చేశారు. విలన్-హీరోకు సరి సమానమైన క్యారెక్టర్, స్క్రీన్ స్పేస్ ఉంచమని కథలో ఎలాంటి మార్పులు చేయవద్దని దర్శక నిర్మాతలకు రామ్ చరణ్ పేర్కొన్నాడట. అందుకే విలన్ పాత్ర కూడా అంతే న్యాచురల్‌గా రావాలని మళ్లీ అరవింద్ స్వామినే తీసుకొచ్చారట.

ఇక ధృవ సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద నోట్లు రద్దు అయిన సందర్భంలో ఈ సినిమా విడుదలైనా కలెక్షన్ల వర్షం కురిపించింది. డీ మానిటైజేషన్‌తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను కొల్లగొట్టింది. చాలా రోజుల తరువాత రామ్ చరణ్‌కు సరైన కథ పడింది బాక్సాఫీస్ షేక్ అయిందని కామెంట్స్ వినిపించాయి.

ధృవ సినిమాకు సిక్స్ ప్యాక్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన రామ్ చరణ్.. ఆపై రంగస్థలం సినిమాకు ఓ పల్లెటూరి కుర్రాడిలా, సాధారణ లుక్‌లోకి మారిపోయాడు. రామ్ చరణ్ ఎన్ని సినిమాలు చేసినా.. ఇంకా భవిష్యత్తులో ఎన్ని గొప్ప సినిమాలు చేసినా.. రంగస్థలం స్థానాన్ని మాత్రం భర్తీ చేయలేదు.

రామ్ చరణ్‌కు నటన రాదు..మొహంలో హావభావాలు పలకవని ఎంతో మంది పరోక్షంగా, ప్రత్యక్షంగా విమర్శించినవారున్నారు. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు అంటూ ఏదేదో కామెంట్స్ చేశారు. ఒక్కసారి చిట్టిబాబుగా తనలోని నటనా కౌశలాన్ని ప్రదర్శించడంతో అందరూ నోరు మూసుకున్నారు. తనను తిట్టిన నోటితోనే ఆకాశానికెత్తేలా పొగిడించుకున్నాడు. చిట్టి బాబు పాత్రలో రామ్ చరణ్ అసాధారణ నటనను కనబర్చి.. నటనలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.

రెండు వందల కోట్లు కొల్లగొట్టిన రంగస్థలం రామ్ చరణ్ సినీ కెరీర్‌లో ఎప్పటికీ ప్రత్యేకమే. ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడు పుట్టిన రామ్ చరణ్.. రంగస్థలం సినిమాతో పరిపూర్ణ నటుడిగా ఎదగడం విశేషం.. ఈ సినిమా కూడా రామ్ చరణ్ పుట్టినరోజుకు మూడు రోజుల తరువాత (మార్చి 30) రిలీజ్ అవ్వడం మరో విశేషం.

రామ్ చరణ్‌లో నిజాయితీకి నిదర్శనంగా నిలిచే మరో ఉదాహరణ వినయ విధేయ రామ. ఈ చిత్రానికి వచ్చిన నెగెటివిటీ, ట్రోల్స్, కామెంట్స్ మరే చిత్రానికి వచ్చి ఉండవు. బోయపాటి శ్రీను క్రియేటివిటికి పరాకాష్టగా నిలిచిన వినయ విధేయ రామ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే ఈ చిత్రం మిమ్మల్ని మెప్పించడంలో విఫలమైనందుకు క్షమించండని బహిరంగంగా క్షమాపణలు అడిగి, మరో చిత్రంతో మీ అంచనాలు అందుకునే ప్రయత్నం చేస్తానని ఓ ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేసి నిజాయితీకి మారు పేరుగా నిలిచాడు.

దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్‌ను మరోసారి డైరెక్ట్ చేస్తున్నాడు. మగధీర తరువాత ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) కోసం కలిశారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ ఉగాది రోజున రిలీజ్ చేశారు. ఇక నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఎలాగూ రామ్ చరణ్ కెరీర్‌ను పీక్స్‌లో తీసుకెళ్తుంది. అది వేరే విషయమనుకోండి. ఆపై కొరటాల శివతో ఓ చిత్రాన్ని చేయనున్నాడని టాక్. ఏది ఏమైనా మంచి కథలను ఎంచుకుంటూ.. అభిమానులను మెప్పించాలని కోరుతూ.. ప్రపంచ ‘రంగస్థలాన్ని’ ఏలాలని కోరుకుంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు మనలోకం తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Read more RELATED
Recommended to you

Latest news