రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉన్న నాయకుల్లో రేవంత్ రెడ్డి ఒకరు. పార్టీలకు అతీతంగా ఆయనకు క్రేజ్ ఉంది. పంచ్ డైలాగులు విసరడంలోనూ.. సవాల్ చేయడంలోనూ రేవంత్ రెడ్డి అందరి దృష్టినీ ఆకర్షించాడు. తెలుగుదేశంలో ఉంటే ఫ్యూచర్ లేదని కాంగ్రెస్ లోకి వచ్చిన ఈ నాయకుడు ఇప్పుడు అనవసరంగా తన ఫ్యూచర్ పాడుచేసుకుంటున్నాడా అనిపిస్తోంది.
హుజూర్ నగర్ టికెట్ వివాదంలో రేవంత్ దూకుడు చూస్తే.. ఆయన శ్రేయోభిలాషులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. రేవంత్ రెడ్డి ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. అంతేకాదు.. ఆయనపై కుంతియాకు ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఇక్కడ ఉత్తమ్ గతంలో మూడు సార్లు గెలిచారు.
అలాంటి చోట.. ఇదిగో ఇతడు నా అభ్యర్థి అంటూ కిరణ్ పేరు ప్రకటించడం కయ్యానికి కాలు దువ్వడమే అనే వాదనలు బాగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో పుంజుకుందామని ఓవైపు బీజేపీ పోటాపోటీగా దూసుకొస్తున్న సమయంలో ఇలా కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఆ పార్టీ భవితవ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ తెలంగాణలో బలంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.
ఇప్పటికే తెలంగాణలో కేసీఆర్ రెండోసారి అధికారంలో కొనసాగుతున్నారు. ఆయన ఎంత బాగా పాలించినా ప్రభుత్వ వ్యతిరేకత వచ్చే ప్రమాదం పుష్కలంగా ఉంది. అలా చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి అవకాశాలు ఉంటాయి. అదే నిజమైతే సీఎం రేసులో ముందుండే వ్యక్తుల్లో రేవంత్ ముందు వరుసలో ఉంటారు.
అలాంటి వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో దూకుడుగా వెళ్లి పార్టీలో శత్రువులను పెంచుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రేవంత్ తీరుపై చాలామంది సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆచితూచి అందరినీ కలుపుకు వెళ్తే రేవంత్ ఫ్యూచర్ బావుంటుంది. మరి రేవంత్ వ్యూహం ఏంటో..?