పార్టీలు ఎన్ని ఉన్నా పొలిటికల్ స్పీచులు ఎలా ఉన్నా అందరి తల రాతలు మార్చేది ఓటే అని చెప్పడం మాత్రం పెద్ద అబద్ధం. మనుషులు మారక వారి జీవితాలు మారక నాయకత్వాలు మారినంత మాత్రాన మనం గొప్పదేదో సాధించామనుకోవడంలో అబద్ధం తప్ప నిజం లేదు.
ప్రజా స్వామ్యం అనే మాటకు నిర్వచనం మారిపోతున్న దశలో ఉన్నాం.కనుక ఇవాళ మన దేశంలో జరిగే ఏ తప్పునకు అయినా బాధ్యత ప్రజలదే! నాయకులదే అని అనడం కన్నా ప్రజలదే అని చెప్పడం సబబు. మంచి నాయకుల ఎన్నిక అన్నది చేయకుండా పాలనలో లోపాలను వెలుగులోకి తేవాలని పరితపించడం తప్పు! ఆ విధంగా మన దేశంలో మన గ్రామాలలో మంచి మార్పులు జరిగిపోతాయని, అభివృద్ధికి నమూనాగా మనం ఉండే ప్రాంతాలు నిలిచిపోతాయని అనుకోవడమే తప్పు! కనుక మనం అనుకున్నవన్నీ అవ్వవు అదేవిధంగా అయ్యేవన్నీ కూడా మన ఊహకు అందిన విధంగా ఉండవు.
అదేవిధంగా ఓటు హక్కు వినియోగం కూడా ! మనం ఎంచుకున్న నాయకులు, వారి అనుయాయులు దేశాన్ని ఎప్పటికప్పుడు మారుస్తున్నాం అని చెప్పడం మినహా చేసేదేం లేదు. ముందున్న కాలంలోనూ చేయగలిగిందేమీ కూడా లేదు.మన ఎదుట ఈవీఎంలలో అన్నీ నిజాలే నిక్షిప్తం అయి ఉంటాయి అని అనుకోవడం భ్రమ. అబద్ధాలకు ఆనవాలుగా ప్రజాస్వామ్యం ఉంటుంది అని తెలుసుకోవడం వాస్తవం.దేశానికి ఇంతటి గొప్ప నాయకులను తయారు చేయడంతోనే పార్టీలు తెగ శ్రమిస్తున్నాయి కనుక వారిని కూడా ఓ సారి స్మరించుకోవాలి.. మరోసారి సన్మానించి పంపాలి.
ఇవాళ జాతీయ ఓటరు దినోత్సవం. ఏటా మాదిరిగానే ఇప్పుడూ పండుగలు జరుగుతాయి.ఏటా మాదిరిగానే ఓటుకు ఉన్న ఆవశ్యకత గురించి మాట్లాడుకోవడం అన్నది ఉంటుంది. ఏటా మాదిరిగానే సంబరాలు ఉంటాయి. కానీ ఏటా మాదిరిగా కాకుండా అనూహ్యం అనుకునే పద్ధతిలో మన వీధి కానీ మన రోడ్డు కానీ బాగుపడడం అన్నది మాత్రం జరగని పని! ఎన్నుకునే పాలకవర్గాలు కేవలం ఉచిత పథకాలకే నిధులు వెచ్చించి, ప్రజలను ఐదేళ్లూ ఎలా ఆకట్టుకోవాలో అన్నదే ప్రధాన విషయంగా చేసుకుని పాలిస్తున్న కొద్దీ దేశంలో సమస్యలు తప్ప పేదరికం తప్ప మరొకటి తారసపడవు.
ఐదేళ్లకు ఒకసారి ఈ దేశంలో అన్నీ మారిపోతాయి. ఐదేళ్లకు ఒకసారి ఈ దేశంలో మనం అనుకున్నవి, మనం అనుకోనివి కూడా వచ్చి వాలిపోతాయి. ఓటు కోసం ఏళ్ల తరబడి చేసిన నిరీక్షణల మాట కానీ ఊసు కానీ వినిపించదు. కానీ కొన్ని ప్రయత్నాల కారణంగా కొందరికి అధికారం మాత్రం వచ్చేస్తుంది.కనుక పండుగ వేళ మనం ఏం మాట్లాడినా అవి కొందరికి వినిపించవు. కొందరికి వినిపించినా పట్టించుకోరు.
కనుక ఓటు అనే ఆయుధం అన్నది ఓ పెద్ద అబద్ధంగానే ఈ దేశాన ఉండిపోతోంది. ఆయుధాలు అన్నీ నాయకుల ఇళ్లల్లోనో దాగుండి పోతున్నాయి. ఆయుధాల వినియోగం సక్రమంగా జరిగిన రోజు మంచి ఫలితాలే వస్తాయి. కానీ ఆ విధంగా జరకపోవడం లేదా వినియోగానికి నోచుకోకపోవడమే విచారకరం.
ప్రజాస్వామ్యం వర్థిల్లాలని అంతా కనే కలలు ఎప్పటికప్పుడు నిజం అవ్వాలని కోరుకోవడంలో తప్పే లేదు.భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత పటిష్టం కావాలి అని కోరుకోవడంలో అస్సలు తప్పు లేదు. కానీ మనదేశంలో ఓటు హక్కు సద్వినియోగం అవుతుందా లేదా అన్నదే పెద్ద సమస్య. పెద్ద సమస్యే కాదు పెద్దల సమస్య కూడా! భారత దేశ సమగ్రతను, స్వేచ్ఛనూ సంబంధిత ప్రతిపాదనలనూ అన్నింటినీ కాపాడే శక్తి ఓటుకు మాత్రమే ఉందని మనం అనుకోవడంలోనే అబద్ధం ఉంది.