తెలంగాణ – విమోచ‌నం.. విలీనం..విద్రోహం..!

-

సెప్టెంబ‌ర్ 17. ఈ రోజు రాగానే.. తెలంగాణలో మ‌న‌కు మూడు మాట‌లు వినిపిస్తాయి. విమోచ‌నం, విలీనం, విద్రోహం. ఈ మూడు వాద‌న‌లు భార‌త్‌లో తెలంగాణ‌ క‌లిసిన నాటి నుంచే ఉన్నాయి. ఇందులో ఏది వాస్త‌వం, ఏది అవాస్త‌వం అని చెప్ప‌డం కంటే.. ఆ వాద‌న‌లు, వాదిస్తున్న వారెవ‌రో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. తెలంగాణ అన‌గానే ముందుగా గుర్తుకు వ‌చ్చే పేరు నిజాం. తెలంగాణ ప్ర‌త్యేక సంస్థానంగా ఉండేది. భార‌త దేశంలో మొత్తం 565 సంస్థానాలు ఉండేవి. 1947 ఆగ‌స్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చింది. దేశంలోని అన్ని సంస్థానాలు భార‌త్‌లో క‌లిశాయి. కానీ.. క‌శ్మీర్‌, జునాఘ‌డ్‌, హైద‌రాబాద్ సంస్థానాలు క‌ల‌వ‌లేదు. ఆ త‌ర్వాత స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ పోలోతో సెప్టెంబ‌ర్ 17 , 1948న హైద‌రాబాద్ సంస్థానం అధికారికంగా భార‌త్‌లో క‌లిసింది. ఇదీ అంద‌రికీ తెలిసిందే.

అయితే.. ఇక్క‌డ విమోచంన‌, విలీనం, విద్రోహం.. ఈ మూడు వాద‌న‌లు ఎందుకు వ‌స్తున్నాయి..? వీటిని చేస్తున్న వారెవ‌రో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.. అది 1917. ర‌ష్యాలో విప్ల‌వం విక‌సించిన కాలం.. అదే స్ఫూర్తితో యూరప్‌లో, చైనాలోనూ విప్ల‌వోద్య‌మం ఉవ్వెత్తున ఎగుస్తున్న స‌మ‌యం.. 1940 త‌ర్వాత చైనాలో విప్ల‌వోద్య‌మం విజ‌యం దిశ‌గా సాగుతున్న కాలం.. ఇక తెలంగాణ‌లోనూ నిజాం నిరంశ‌కు పాల‌న‌కు, దొరలు, భూస్వాముల‌కు వ్యతిరేకంగా ప్ర‌జ‌లు ఉద్య‌మించ‌డం ప్రారంభ‌మైంది. భూమి కోసం, భుక్తి కోసం.. వెట్టిచారికి విముక్తి కోసం ప్ర‌జ‌లు పోరు బాట ప‌ట్టారు. జూలై 4, 1946లో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో దొడ్డికొముర‌య్య వీర‌మ‌ర‌ణంలో ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసింది. దొర‌లు, భూస్వాములకు వ్య‌తిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రూపుదిద్దుకుంది. ప్ర‌జ‌లంతా ఏక‌మై ముందుకు సాగారు.

ఈ క్ర‌మంలో సుమారు మూడు వేల గ్రామాల్లో గ్రామ‌స్వరాజ్యాలు ఏర్ప‌డ్డాయి. భూస్వాములను త‌రిమికొట్టి.. సుమారు ప‌దిల‌క్ష‌ల ఎక‌రాల భూములను ప్ర‌జ‌లు స్వాధీనం చేసుకున్నారు. పంట‌లు పండించుకున్నారు. ప్ర‌జ‌ల పోరాటంతో భూస్వాములు, దొర‌లు గ‌జ‌గ‌జ వ‌ణికిపోయారు. నిజాంకు వ్య‌తిరేకంగా సుమారు రెండున్న‌ర ఏళ్ల‌పాటు జ‌రిగిన ఈ పోరాటంలో సుమారు మూడు వేల‌మంది ప్ర‌జ‌లు ప్రాణ‌త్యాగం చేశారు. దాదాపుగా తెలంగాణ ప‌ల్లెల‌న్నీ పీడ‌న నుంచి విముక్త‌మ‌య్యాయి. ఇక ఇదే స‌మ‌యంలో నిజాం ప్ర‌భువులో వ‌ణుకుమొద‌లైంది. ఈ నేప‌థ్యంలోనే నిజాం రాజు భార‌త్ ప్ర‌భుత్వం ముందు మొక‌రిల్లి, తాను హైద‌రాబాద్‌ను భార‌త్‌లో క‌లిపేస్తాన‌ని, త‌న‌ను ఆదుకోవాలంటూ వేడుకున్న‌ట్లు ప‌లు క‌మ్యూనిస్టు పార్టీలు అంటున్నాయి. ఇదే అద‌నుగా భావించిన భార‌త్ ప్ర‌భుత్వం వెంట‌నే.. నిజాం నుంచి తెలంగాణ విముక్తి పేరుతో విప్ల‌వోద్య‌మాన్ని అణ‌చివేసేందుకు కుట్రప‌న్నింద‌ని, అందుకే ఆప‌రేష‌న్ పోలో చేప‌ట్టింద‌ని ప‌లువురు వాదిస్తున్నారు.

తెలంగాణ‌లో ఎగిసిప‌డుతున్న విప్లవోద్య‌మాన్ని అణ‌చివేయ‌కుంటే.. అది దేశ‌వ్యాప్తం అవుతంద‌ని, అప్పుడు దేశం క‌మ్యూనిస్టు పార్టీ చేతిలో వెళ్తుంద‌ని భావించిన ప‌టేల్‌.. భార‌త్ సైన్యంతో తెలంగాణ‌లోకి వ‌చ్చార‌ని, ఈ క్ర‌మంలో నాలుగు నెల‌ల్లోనే సుమారు నాలుగువేల మంది ప్ర‌జ‌ల‌ను చంపార‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. భార‌త్ సైన్యం విప్ల‌వోద్య‌మాన్ని దారుణంగా అణ‌చివేసింద‌ని, భార‌త్ సైన్యం రాక‌తో.. తెలంగాణ‌లో ఏర్ప‌డిన గ్రామ‌స్వ‌రాజ్యాలు దెబ్బ‌తిన్నాయ‌ని, ప్ర‌జ‌లు పోరాడి సాధించిన భూముల‌న్నీ మ‌ళ్లీ భూస్వాముల చేతుల్లోకి వెళ్లాయి. అందుకే ప‌లు క‌మ్యూనిస్టు పార్టీలు సెప్టెంబ‌ర్ 17ను విద్రోహ‌దినంగా పాటించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఆప‌రేష‌న్ పోలోను నిజాం రాజు, భార‌త ప్ర‌భుత్వం ఆడిన నాట‌కంగా భావిస్తున్నాయి.


ఇక ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌ను ముస్లిం రాజుల నుంచి స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విముక్తం చేసి, భార‌త్ విలీనం చేశార‌ని, అందుకే సెప్టెంబ‌ర్ 17ను విమోచ‌న దినంగా పాటించాల‌ని బీజేపీ వాదిస్తోంది. ముస్లిం పాల‌కుల నుంచి హిందూ స‌మాజానికి విముక్తి ల‌భించింది కాబ‌ట్టి.. విమోచ‌న దినాన్ని అధికారికంగా నిర్వ‌హించి, జాతీయ జెండాల‌ను ఎగుర‌వేయాల‌ని డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక తెలంగాణ‌లో ఎగిసిప‌డిన ప్ర‌జా ఉద్య‌మానికి త‌ట్టుకోలేక నిజాం రాజు భార‌త్ ప్ర‌భుత్వానికి లొంగిపోయాడ‌ని, తానే స్వ‌యంగా విలీనం చేస్తాన‌ని చెప్పాడ‌ని, అందుకే విలీన దినంగా పాటించాల‌ని ప‌లు వామ‌ప‌క్షాల‌తోపాటు ప‌లువురు మేధావులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news