ప్రధాని నరేంద్ర మోదీ.. యువతకు ఆయన రోల్ మోడల్.. ఎంతో మందికి ప్రేరణనిచ్చే స్ఫూర్తి ప్రదాత.. కష్టాలెదురైనప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పే వారిలో మోదీ ఎప్పుడూ ముందే ఉంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ.. యువతకు ఆయన రోల్ మోడల్.. ఎంతో మందికి ప్రేరణనిచ్చే స్ఫూర్తి ప్రదాత.. కష్టాలెదురైనప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పే వారిలో మోదీ ఎప్పుడూ ముందే ఉంటారు. పుల్వామా దాడిలో ఎంతో మంది భారత సైనికులు అసువులు బాస్తే వారికి నేనున్నాంటూ ధైర్యం చెప్పారు. సర్జికల్ దాడులతో పాక్ ఉగ్రవాదుల భరతం పట్టి మన సైనికులకు ఆ విజయం అంకితం చేశారు. అంతెందుకు.. మొన్నీ మధ్యే చంద్రయాన్ 2 విఫలం చెందితే ఇస్రో చైర్మన్ శివన్‌ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఇలా.. ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక సంఘటనల్లో మోదీలో మనకు ఒక ఆదర్శమైన వ్యక్తి కనిపిస్తారు.
దేశంలో పాలన గాలికొదిలేసి దేశాలు తిరుగుతారు.. అంటూ చాలా మంది మోదీపై నిందలు వేస్తారు. కానీ ఆయన అలా అన్ని దేశాలు తిరిగి.. ఆయా దేశాలకు చెందిన నేతలతో మాట్లాడబట్టే నేడు ఉగ్రవాదంపై పోరులో అన్ని దేశాలకు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. అందుకనే పాకిస్థాన్ ఆ విషయంలో ఏకాకి అయింది. అలా అన్ని దేశాలను ఒప్పించి వారి మద్దతు కూడగట్టడంలో మోదీ ఎనలేని పాత్ర పోషించారు. మోదీ మన ప్రధానిగా ఉన్నారంటే.. పాక్‌కు భయం. ఏం చేస్తే ఎలా స్పందిస్తారోనని.. అందుకనే మన ఐఏఎఫ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాక్ సైనికులు బందీని చేసినా.. మోదీకి భయపడి అతన్ని వెంటనే విడుదల చేశారు. అదీ.. మోదీ అంటే.. అందుకనే పాక్ ఆయన్ను చూసి భయపడుతుంది.
ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను దీటుగా ఎదుర్కోవడంలో మోదీ ముందే ఉంటారు. ఆయన మాటల తూటాలకు వారు తట్టుకోలేరు. ఎన్నికల సమయంలోనే కాదు.. సాధారణ సమయాల్లోనూ మోదీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిస్తే.. ఆయన ఉపన్యాసాన్ని వినేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు. ప్రజలను మంత్ర ముగ్ధులను చేసి తన వైపుకు తిప్పుకునేలా స్పీచ్‌లివ్వడం మోదీకి వెన్నతో పెట్టిన విద్య. ఇక డిజిటల్ పరికరాల ఉపయోగంలోనూ మోదీ అందరు నేతలకన్నా ముందే ఉంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆయన ప్రజలకు దగ్గరగా ఉంటారు. అందుకనే ఆయనకు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు.
దేశంలోని ఎంతో మంది యువ ఔత్సాహికులకు మోదీ చెప్పే మాటలు మంత్రాల్లా పనిచేస్తాయి. దేశంలో ఉన్న యువతలో ఎంతో నైపుణ్యం ఉందని, వారికి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి ఆయన మేకిన్ ఇండియా ప్రోగ్రామ్‌ను లాంచ్ చేస్తే అందుకు అనేక కంపెనీల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇక గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నిర్మించడం వెనుక దేశ ప్రజలందరూ ఐక్యతతో ఉండాలనే మోదీ నినాదం ప్రజలందరిలోకీ బలంగా వెళ్లింది. మోదీ రెండోసారి ప్రధాని అయ్యారంటే.. కేవలం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కాదు.. ఆయన ఉంటే దేశానికి భరోసా ఉంటుందని ప్రజలు నమ్మారు. అందుకనే ఆయనకు మరోసారి పట్టం కట్టారు. ముఖ్యంగా అనేక వర్గాలకు చెందిన ప్రజలు మోదీ వెంటే నిలిచారని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు మనకు సత్యాన్ని చాటి చెప్పాయి. భవిష్యత్తులోనూ మోదీ ప్రజామోదం పొందిన ఉత్తమ ప్రధానిగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు..!