ఒక వ్యక్తి మైనపు బొమ్మ తయారు చేయడానికి కోటిన్నర దాకా ఖర్చవుతుందట. మరి.. ఖర్చు.. మైనపు విగ్రహం ఎవరిదో వాళ్లు భరిస్తారా? లేక మ్యూజియం నిర్వాహకులా? అంటే.. నిర్వాహకులే భరిస్తారు. విగ్రహం ఎవరిదో వాళ్లు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు.
మేడమ్ టుస్సాడ్స్.. ఈ పేరు వినగానే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖుల మైనపు విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేస్తారు అనే విషయం మాత్రం మనకు తెలుసు. అసలు ఈ మేడమ్ టుస్సాడ్స్ అంటే ఏంటి? అది ఎవరి పేరు? మనిషిదేనా? లేక ఎవరిది? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? ప్రముఖుల మైనపు విగ్రహాలను వాళ్లు ఎందుకు తయారు చేస్తారు. వాళ్ల దృష్టిలో ప్రముఖులంటే ఎవరు? ప్రామాణికం ఏంటి? ఇదిగో ఇలాంటి వంద డౌట్లు వస్తున్నాయి మనకు. కానీ.. దాని గురించి విడమర్చి చెప్పేవాళ్లు ఎవ్వరూ లేరు. అదిగో.. మేడమ్ టుస్సాడ్స్‌లో ఆ హీరో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారట. ఇదిగో.. ఈ హీరోది కూడా ఏర్పాటు చేస్తున్నారట.. అంటూ చెప్పడం.. మనం వినడం తప్పితే.. దాని గురించి ఎక్కువగా ఏం తెలియదు.
మరీ.. ఈ మధ్య అయితే.. దాదాపు అందరు హీరోల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు అక్కడ. ఇలా.. అందరి విగ్రహాలను ఏర్పాటు చేసేశాక.. విగ్రహాల ఏర్పాటుకు ప్రామాణికం ఏముంది. ప్రముఖులు కాకుండా.. సాధారణ ప్రజల విగ్రహాలను ఎందుకు ఏర్పాటు చేయరు.. వామ్మో.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రశ్నలకు అంతే ఉండదు కానీ.. మేడమ్ టుస్సాడ్స్ అసలు కథేంటో తెలుసుకుందాం పదండి. ముందుగా అసలు మేడమ్ టుస్సాడ్స్ అంటే ఏంటి? ఆపేరు ఎవరిది? కంపెనీ పేరా? మనిషి పేరా? ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.
అన్నా మారియా గ్రోషోల్జ్ అనే మహిళ.. 1761లో ఫ్రాన్స్‌లో జన్మించింది. తర్వాత 1795 మారియా అనే మహిళ ఫ్రాంకోయిస్ టుస్సాడ్స్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో ఆమె అసలు పేరు పోయి.. మేడమ్ టుస్సాడ్స్‌గా ఆమె పేరు మారిపోయింది.
అయితే.. మేడమ్ టుస్సాడ్స్ పుట్టడానికి రెండు నెలల ముందు.. ఆమె తండ్రి యుద్ధంలో మరణిస్తాడు. టుస్సాడ్స్ పుట్టాక ఆమె తల్లి టుస్సాడ్స్‌ను స్విట్జర్లాండ్‌కు తీసుకెళ్తుంది. అక్కడ ఆమె తల్లి డాక్టర్ ఫిలిప్పే కర్టియస్ అనే వ్యక్తి దగ్గర హౌస్ కీపర్‌గా పని చేస్తుంది. ఆయన మైనపు విగ్రహాలు తయారు చేయడంలో దిట్ట. చిన్నప్పటి నుంచి ఆ డాక్టర్ ఇంట్లోనే పెరిగిన మేడమ్ టుస్సాడ్స్.. డాక్టర్ తయారు చేసే మైనపు విగ్రహాలను చూసేది. ఆయన ఎలా చేస్తున్నారో గమనించేది. నెమ్మదిగా.. తనకు కూడా వాక్స్ మోడలింగ్‌పై ఆసక్తి పెరగడంతో ఆయన వద్దే మైనపు విగ్రహాలు తయారు చేయడం నేర్చుకుంది. అంతే కాదు.. మంచి నైపుణ్యత కూడా సాధించింది.
తన 16వ ఏటనే ఫ్రాంకోయిస్ వాల్టేర్ అనే రచయిత మైనపు విగ్రహాన్ని తయారు చేసింది. ఆ తర్వాత జీవితంలో ఏదో ఒకటి సాధించిన వాళ్ల విగ్రహాలను తయారు చేయడం ప్రారంభించింది. జీన్ జాక్వెస్ రూసో, బెంజమిన్ ఫ్రాంక్లిన్ వంటి ప్రముఖుల మైనపు బొమ్మలను కూడా రూపొందించింది. 1794లో మైనపు విగ్రహాలు తయారు చేసే డాక్టర్ మరణించడంతో.. అతడి వద్ద ఉన్న వాక్స్ మోడలింగ్ చేసే పరికరాలన్నీ తన సొంతమయ్యాయి.
టుస్సాడ్స్ కళా నైపుణ్యం తెలుసుకున్న 16వ లూయీ తన సోదరికి ఈ విద్యను నేర్పాలని టుస్సాడ్స్‌ను ఆహ్వానించాడు. అలా.. తన కళా నైపుణ్యం గురించి ప్రపంచానికి తెలిసింది. 1802లో తన భర్తతో కలిసి లండన్ వెళ్లి అక్కడ మైనపు విగ్రహాలను ప్రదర్శించింది. అలా.. ప్రపంచంలోని ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి అంతటా ప్రదర్శించడం ప్రారంభించింది టుస్సాడ్స్.
తర్వాత 1835లో లండన్‌లోని బేకర్ స్ట్రీట్‌లో తన పేరు మీదే ఓ మ్యూజియంను ఏర్పాటు చేసింది. ఆ మ్యూజియం పేరే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం. అక్కడ తను తయారు చేసిన విగ్రహాలను ప్రదర్శనకు ఉంచింది. ఆ మ్యూజియానికి సందర్శకుల తాకిడి ఎక్కువవడం.. విదేశీయులు కూడా ఆమె అద్భుతమైన కళా నైపుణ్యానికి ముగ్ధులైపోవడంతో.. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో తన పేరుతోనే మ్యూజియాలను ఏర్పాటు చేసింది.
1850లో మేడమ్ టుస్సాడ్స్ కన్నుమూసింది. అయితే.. ఆమె చనిపోవడానికి 8 ఏళ్ల ముందే.. తన మైనపు బొమ్మను తానే రూపొందించుకుంది మేడమ్ టుస్సాడ్స్. ఆమె మైనపు బొమ్మ.. ఇప్పటికీ లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చూడొచ్చు. అయితే.. తను మరణించినప్పటికీ.. ఆమె దగ్గర పనిచేసే వాళ్లు.. ఆ పనిని నేర్చుకొని ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో ఉన్న మ్యూజియాలను కొనసాగిస్తున్నారు.
వాటికి ఇంకా డిమాండ్ పెరగడంతో మ్యూజియాలను ఇంకా విస్తరించారు. భారత్‌లోని ఢిల్లీలో కూడా వీళ్ల మ్యూజియం ఉంది. రోజురోజుకూ వాళ్లు తయారు చేస్తున్న మైనపు విగ్రహాలకు డిమాండ్ పెరుగుతుండటం, ఇండియన్స్ కూడా వాటిపై ఆసక్తి కనబరుస్తుండటంతో.. ముందుగా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మైనపు విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఒక్క భారత్‌లోనే కాదు.. ఆసియా నుంచి కూడా మేడమ్ టుస్సాడ్స్ మైనపు విగ్రహం తయారు చేయబడిన మొదటి వ్యక్తి అమితాబ్. 2000 సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ మైనపు బొమ్మను లండన్‌లోని మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత.. బాలీవుడ్ స్టార్లు హృతిక్ రోహన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, వరుణ్ దావన్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే, ప్రధాని మోదీ, క్రికెటర్ సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ.. తదితరుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. సౌత్ ఇండియా నుంచి మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటైన మొదటి మైనపు విగ్రహం ప్రభాస్‌దే. ఆ తర్వాత మహేశ్ బాబుది ఏర్పాటు చేశారు.
ఒక్క విగ్రహం తయారీకి ఖర్చెంత? ఖర్చు ఎవరు భరిస్తారు?
ఒక వ్యక్తి మైనపు బొమ్మ తయారు చేయడానికి కోటిన్నర దాకా ఖర్చవుతుందట. మరి.. ఖర్చు.. మైనపు విగ్రహం ఎవరిదో వాళ్లు భరిస్తారా? లేక మ్యూజియం నిర్వాహకులా? అంటే.. నిర్వాహకులే భరిస్తారు. విగ్రహం ఎవరిదో వాళ్లు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. కాకపోతే.. ఆ విగ్రహాన్ని మ్యూజియంలో పెట్టినప్పుడు వచ్చే సందర్శకుల నుంచి వసూలు చేసే డబ్బుల ద్వారా వాళ్లకు ఆదాయం సమకూరుతుంది.
హీరో ప్రభాస్ విగ్రహం తయారీకి వాళ్లకు కోటిన్నర ఖర్చయిందట. అలాగే.. ప్రధాని మోదీ మైనపు బొమ్మలను నాలుగు తయారు చేసి.. లండన్, బ్యాంకాక్, సింగపూర్, హాంకాంగ్‌లోని మ్యూజియాల్లో ఏర్పాటు చేశారు. నాలుగు తయారు చేయడానికి వాళ్లకు 6 కోట్లకు పైగా ఖర్చయిందట.
అయితే.. ఈ మధ్య వీళ్లు ఎక్కువ మంది ప్రముఖుల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరో ఒకరి విగ్రహం ఏర్పాటు చేస్తే ఓకే కానీ.. ఒకరి తర్వాత మరొకరు.. ఎక్కువగా పేరు లేని వారి విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడంతో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాల్యూ తగ్గిపోతుంది.. అనే ఆరోపణలూ వస్తున్నాయి. అయితే.. వాళ్లు ఈ మధ్య చాలామంది ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఓ కారణం ఉందట. వాళ్ల మ్యూజియాలను సందర్శించే టూరిస్టుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందట. దీంతో టూరిస్టులు కొత్త కొత్త విగ్రహాలను కోరుకుంటున్నారట. మరింత మంది ప్రముఖులు విగ్రహాలను పెట్టాలని కోరుతున్నారట. వాళ్లు బిజినెస్ నడవడం కోసం, టూరిస్టుల కోరికను తీర్చడం కోసం.. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉంటే చాలు.. వాళ్ల విగ్రహాలను తయారు చేసి.. మ్యూజియాల్లో పెట్టి టూరిస్టులను ఆకర్షిస్తున్నారన్నమాట. అందుకే.. ఈ మధ్యనే చాలామంది ప్రముఖుల విగ్రహాలను వాళ్లు ఏర్పాటు చేశారు. రీసెంట్‌గా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న సెలబ్రిటీ అయితే.. వాళ్లు ఆ దేశానికే పరిమితం కాకుండా.. ప్రపంచ స్థాయిలో వాళ్లకు ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి.. ఇది కేవలం వ్యాపార ధోరణితో.. ఇతర దేశాల సందర్శకులను ఆకర్షించడానికి వేసే ఎత్తులు మాత్రమే.