నిర్భయ అత్యాచారం, హత్య కేసు నిందితులకు దాదాపుగా దారులు అన్నీ మూసుకుపోయినట్టే కనపడుతుంది. వాళ్ళు ఇప్పటి వరకు ఆడాల్సిన డ్రామాలు అన్నీ దాదాపుగా ఆడేసారు. ఎట్టకేలకు మూడో సారి కోర్ట్ వారికి డెత్ వారెంట్ జారీ చేసింది. 7 ఏళ్ళ నుంచి ఉరి శిక్షను అన్ని విధాలుగా తప్పించుకుంటూ వస్తున్న నిర్భయ దోషులు అనేక పిటీషన్ల మీద పిటీషన్ లు దాఖలు చేస్తూ రావడం, విచారణలు చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.
ఇక తాజాగా నా మానసిక పరిస్థితి బాగాలేదని, ఉరి తీయవద్దని వినయ్ శర్మ అనే వాడు పిటీషన్ దాఖలు చేసాడు. ఆ పిటీషన్ ని కోర్ట్ కొట్టేసింది. అసలు అలాంటిది ఏమీ లేదని, మరణం ముందు అలాంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయని కోర్ట్ పేర్కొంది. మరణశిక్ష పడిన దోషిలో సాధారణ ఆందోళన, నిరాశ స్పష్టంగా కనిపిస్తోందని, దోషికి వైద్య, మానసిక చికిత్స ఇప్పటికే అందాయని కోర్ట్ స్పష్టం చేసింది.
దోషి చెబుతున్నదాంట్లో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు. పిటిషనర్ గోడకు తలను బాదుకోవడం నిజమే అయినా, అది ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని జైలు అధికారుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. వైద్యులు అతడిని పరీక్షించి మందులు ఇచ్చారని పేర్కొన్నారు. దోషి తరపు లాయర్ చెబుతున్నట్టు అతడికి ఎలాటి ఫ్రాక్చర్ కాలేదని, అతడి మానసిక ఆరోగ్యం బాగానే ఉందన్నారు.
దీనితో వారిని ఉరి తీయడం అనేది దాదాపుగా ఖాయంగా కనపడుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళని మార్చ్ 3 న ఉరి తీయకపోతే మాత్రం దేశాన్ని చూసి చాలా మంది నవ్వుతారు. ఇప్పటి వరకు వాళ్లకు అన్ని అవకాశాలను న్యాయవ్యవస్థ ఇస్తూ వస్తుంది. వాళ్ళు ఆడాల్సిన నాటకాలు అన్నీ ఆడారు. చేసిన పని చేసి ఇప్పుడు అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటూ డ్రామాలు ఆడటం మాత్రం నిజంగా న్యాయవ్యవస్థను అవమానించడమే.