ఆప్టర్ ఇంటర్ ఏం చదవాలి…? వివిధ రంగాలు – కోర్సులపై ప్రాథమిక సమాచారం

-

ఇంటర్ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడేం చేయాలి? టెన్త్ తర్వాత పెద్దగా ఆలోచించాల్సిన అవసరంరాదు. టెన్త్ పూర్తి అవ్వగానే సహజంగా ఇంటర్‌లోకి ప్రవేశిస్తారు. మరిప్పుడు ఏం చేయాలి? ఐఐటీ, ఎంసెట్, నీట్ వంటి ఎంట్రన్సుల ద్వారా మంచి ర్యాంక్ సాధించి ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు ఖాయమైతే ఫర్వాలేదు. మరి ఇది మిస్ అయిన వారు ఏం చేయాలి? అలాగే అసలు ఈ ఎంట్రన్సులు రాయని చేయని వారు ఏం చేయాలి? ఇంజనీరింగ్ – మెడిసిన్ కాక ఉన్న ఇతర మార్గాలేమిటి? ఇంటర్ తర్వాత ఏయేకోర్సుల వైపు వెళ్ళవచ్చు?

వివిధ రంగాలు – కోర్సులపై ప్రాథమిక సమాచారం.

ప్రతి విద్యార్ధి జీవితంలో టెన్త్, ఇంటర్మీడియట్ కోర్సులు కీలకమైన మలుపులు తిప్పుతాయి. టెన్త్ పాసైతే సర్వ సాధారణంగా ఇంటర్మీడియట్ వైపు మొగ్గు చూపిస్తారు. అప్పటి వరకు సాధారణ విద్య అభ్యసించిన వారు ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్ విద్యార్ధులు, సైన్స్ విద్యార్ధులుగా విడిపోతారు. లెక్కలంటే, సైన్స్ అంటే భయపడే వారు ఆర్ట్స్ విద్యార్ధులుగా కామర్స్, హిస్టరీ గ్రూపులపట్ల ఆసక్తి కనబరుస్తారు. ఇక్కడే వారు తమ గమ్యం, లక్ష్యం నిర్దేశించుకుంటారు. తమ జీవితంలో ముందు స్థిరపడే వృత్తి కూడా దీనితో ఎంపికవుతుంది. అదే విధంగా సైన్స్ విద్యార్ధులుగా ముద్ర పడినవారు ఇంజనీర్ కావాలనో, డాక్టర్ కావాలనో, శాస్త్రవేత్త కావాలనో కలలు కంటుంటారు. తల్లిదండ్రుల ఆలోచన కూడా ఈ సందర్భంలో నిర్ణయమవుతుంది.

ప్రతీ తండ్రి తమ కుమారుడు / కుమార్తెను డాక్టర్‌గానో, ఇంజనీర్‌గానో ఊహించుకుంటూ తమ పిల్లల చదువును కొనసాగిస్తారు. తమ జీవితంలో అత్యంత కీలకమైన లేదా మన జీవితంలో చేయదల్చుకున్న వృత్తిని ఎంపిక చేసుకునే సమయంలో తల్లిదండ్రులైనా, విద్యార్ధులైనా నిర్దిష్టంగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అందుకే తమ పిల్లల అభిరుచులు, ఇష్టాలు, అవగాహన, ఆసక్తి గమనించి తల్లిదండ్రులు వాటికనుగుణంగా అందుబాటులో ఉన్న కోర్సులను ఎంపిక చేయాలి. ఇష్టం లేకపోయినా ఇంజనీర్ కావాలనో, డాక్టర్ కావాలనో బలవంతంగా వారిపై సబ్జెక్టులను రుద్దకూడదు. డాక్టర్లయినవారు డాక్టర్లుగా పనిచేయడం లేదు. డాక్డర్ కోర్స్ పూర్తి చేసినవారు ఐఎఎస్‌లుగాను, రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆర్డ్స్ గ్రూపులు చదివిన వారు ఎంతో మంది పరిపాలనలో ఐఎఎస్‌లుగాను, రాజకీయ నాయకులుగాను రాణిస్తున్నారు. ఏ కోర్సు చేసినా, ఏ సబ్జెక్టు చదివినా, ఏ వృత్తిని ఎంపిక చేసుకున్నా సమాన అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అవకాశాలను, కోర్సులను క్షుణ్ణంగా పరిశీలించి, ఆధ్యయనం చేసి, ఆయా రంగాలలో నిపుణులైన వారిని సంప్రదించి అనుభవాల ఆధారంగా ఆయా కోర్సులను ఎంపిక చేసుకోవడం ఉత్తమంగా ఉంటుంది. ఇంటర్ తర్వాత చేయతగ్గ కోర్సులు ఇన్ని ఉన్నాయా? అనే విధంగా నేడు కోర్సుల రూపకల్పన జరుగుతోంది. అయితే అందరూ ఏ కోర్సును సిఫారసు చేస్తున్నారు అని కాక మన ప్రవృత్తికి నప్పేది, రానున్న కాలంలో ఉజ్వలంగా భాసించే కోర్సును ఎంపిక చేసుకోవడం ఉత్తమం.


డిగ్రీ కోర్సులు

ఇంటర్మీడియట్ పాసైనవారు సాధారణంగా డిగ్రీ కోర్సుల పట్ల ఆసక్తి కనబరుస్తారు. దేశ వ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుగా మూడేళ్ళ కాల పరిమితి కలిగిన బీఏ, బీఎస్సీ, బీకాం వంటి డిగ్రీలను పలు యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలు ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగాడిగ్రీ కోర్సులో ఒక మెయిన్ సబ్జెక్ట్, రెండు ఇతర ఆప్షనల్ సబ్జెక్టులను బోధిస్తారు. సాధారణంగా డిగ్రీ పూర్తిచేస్తేకనీసం మూడు సబ్జెక్టులో మంచి అవగాహన, అనుభవం వస్తుంది. అనంతరం ఎం.ఎ., ఎం.ఎస్.సి., ఎం.కాం వంటి కోర్సులను చేయవచ్చు. ఇటీవల డిగ్రీ కోర్సుల సబ్జెక్టులలో ఆధునిక అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేశారు. బీబీఏ, బీబీఎం, బీసీఏ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ మెయింటెనెన్స్, జర్నలిజం, టూరిజం మేనేజ్‌మెంట్, ఫారిన్ ట్రేడ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, అడల్ట్ ఎడ్యుకేషన్ వంటి నూతన సబ్జెక్టులను ప్రవేశ పెట్టారు. డిగ్రీ స్థాయిలో ఒకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టారు. ప్రతి డిగ్రీ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. కాలేజీ వాతావరణం, లెక్చరర్ల బోధన సమర్ధనీయమైన యాజమాన్యం, పరీక్షల నిర్వహణ వంటి అంశాలలో జాగ్రత్తలు పాటించే డిగ్రీ కళాశాలలను ఎంపిక చేసుకోవడం మంచిది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రాష్ట్రంలోని కొన్ని కళాశాలలను అటానమస్ కళాశాలలుగా గుర్తించి ప్రోత్సహిస్తోంది. ఈ అటానమస్ కళాశాలల్లో సెమిస్టర్ విధానం అవలంబిస్తూ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించినవారే వాల్యుయేషన్ పూర్తి చేసి అయా యూనివర్సిటీల ద్వారా సర్టిఫికేట్లు ప్రదానం చేస్తారు. దీని వల్ల యూనివర్సిటీల పనిభారం, వత్తిడి తగ్గి డిగ్రీ స్థాయిలో గుణాత్మకమైన విద్యా బోధన జరుగుతుందనే లక్ష్యంతో అటానమస్ కళాశాలల వ్యవస్థను ఏర్పాటు చేసింది. అందువల్ల మీ లక్ష్యం మేరకు సాంప్రదాయ డిగ్రీ కోర్సులైన బిఎ, బికాం, బిఎస్‌సి కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత యూపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ నిర్వహించే సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2, 3, 4 పోటీ పరీక్షలకు హాజరు కావచ్చు. రైల్వే, బ్యాంక్ ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు హాజరై ఉద్యోగాలు పొందవచ్చు.

ఫైన్ ఆర్ట్స్ కోర్సులు

లలిత కళల పట్ల అభిరుచి ఉన్నవారు ఇంటర్మీడియట్ అనంతరం ఫైన్ ఆర్ట్స్ కోర్సులు చేయవచ్చు. రాష్ట్రంలోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్టిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్‌వారు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. బిఎఫ్‌ఎలో శిల్పకళ, చిత్రకళ, అప్లయిడ్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ కోర్సులు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని శ్రీ వేంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల, హైదరాబాద్ వారు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో ఫోటోగ్రఫీ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్‌వారు బిఎలో స్కల్ప్‌చర్ పెయింటింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం వారు బిఎఫ్‌ఎలో అప్లయిడ్ ఆర్ట్స్ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. ఈ యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల నోటిఫికేషన్లు వెలువడ్డ తర్వాత దరఖాస్తు చేయాలి.

ఐదేళ్ళ లా కోర్సులు

న్యాయ విద్య పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్ధులకు ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ళ న్యాయ విద్య డిగ్రీ కోర్సులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నాయి. ఈ రంగంలో సెటిల్ కావడానికి ఎక్కువ సమయం తీసుకున్నా గ్యారంటీగా ఉపాధి లభిస్తుంది. భారత రాజ్యాంగం, క్రిమినల్, సివిల్ చట్టాలు, పౌర హక్కులు, వ్యాపార, వాణిజ్య చట్టాలు, కార్మిక చట్టాలు, ఇతర సామాజిక రక్షిత చట్టాలపట్ల అవగాహన, ఆసక్తి ఉంటే మీరు న్యాయ విద్య పట్ల ఆసక్తి చూపడం మంచిది. ఇంటర్ తర్వాత బిఎ, ఎల్‌ఎల్‌బి అనే ఐదేళ్ళ డిగ్రీ కోర్సును రూపొందించారు. రాష్ట్రంలో లాసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఐదేళ్ళ లా కోర్సులకు అడ్మిషన్ లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ, ప్రైవేట్ న్యాయ కళాశాలలు ఈ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. ఈ కళాశాలల్లో అడ్మిషన్ లభించాలంటే ఆ ఏడాది నిర్వహించే లాసెట్ పరీక్ష పాసై ఉండాలి. లాసెట్ కన్వీనర్ ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తారు. ప్రతి ఏటా యూనివర్సిటీలు లా సెట్ పరీక్షను నిర్వహిస్తాయి. అదే విధంగా బెంగుళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ అనే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కూడా ఐదేళ్ళ బిఎ ఎల్‌ఎల్‌బి (ఆనర్స్) కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ సంస్థ న్యాయ విద్యలో ఉత్తమమైన బోధన, ఫ్యాకల్టీ కలిగి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. దేశవ్యాప్తంగా వేలాది మంది అడ్వకేట్లను, జడ్జీలను, లా ఆఫీసర్లను ఈ సంస్థ తయారు చేసింది. నల్సార్ క్యాంపస్, శామీర్‌పేట్ దగ్గర పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసారు. ఈ సంస్థను నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీగా వ్యవహరిస్తున్నారు. ఈ క్యాంపస్‌లో ఐదేళ్ళ బిఎఎల్‌ఎల్‌బి (ఆనర్స్), ఎల్.ఎల్.ఎం., పలు డిప్లొమా కోర్సులను ఆఫర్ చేస్తోంది. అఖిల భారత స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్ష క్లాట్ ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తారు.


సీఏ, ఐసీడబ్ల్యూఏఐ కోర్సులు

ఇంటర్ తర్వాత కామర్స్ అభ్యర్ధులు వెూజుపడే కోర్సు ఐసీడబ్ల్యూఏ. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ సంస్థ న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తూ ఐసిడబ్ల్యుఎ కోర్సు ఆఫర్ చేస్తోంది. ఇంటర్మీడియట్ పాసైనవారు ఐసిడబ్ల్యుఎ ఫౌండేషన్ కోర్సు చేయడం ద్వారా ఈ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. ఫౌండేషన్ కోర్సు పాసైతే ఈ సంస్థ ఇంటర్, ఫైనల్ కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటర్ పరీక్షలు పాసైతే కొన్ని కంపెనీలు ఉద్యోగం ఆఫర్ చేస్తుంటాయి. ఫైనల్ పరీక్షలు పాసైతే పలు ప్రైవేట్ కంపెనీలలో కాస్ట్ అకౌంటెంట్‌గా నియామకం పొందవచ్చు. లేదా కన్సల్టెన్సీ సర్వీసులు ఏర్పాటు చేసుకుని ఆదాయం పొందవచ్చు. ఇంటర్ విద్యార్ధుల కోసం ఫౌండేషన్ కోర్సులను డిజైన్ చేసి ఇంటర్‌తోపాటే ఫౌండేషన్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా సిఎ, ఐసిడబ్ల్యుఎ, సిఎస్ వంటి కోర్సులలో ప్రవేశం పొందవచ్చు. దీనివల్ల విద్యార్ధికి ఎంతో సమయం, డబ్బు ఆదావుతుంది. అతి చిన్న వయస్సు నుండే తన కెరీర్ ఎంపిక చేసుకునే మార్గం ఏర్పడుతుంది. ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేయడం ఉపాధి దృష్ట్యా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

కామర్స్ గ్రూప్ పట్ల ఆసక్తి ఉన్న ప్రతి వారు చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) కావాలని కలలు కంటుంటారు. ఇది ఒక వృత్తి పరమైన కోర్సు. కంపెనీ అకౌంట్లు ఆడిట్ చేయడమే ప్రధానంగా ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయంగా ఉన్న పలు ప్రైవేటు కంపెనీలు, బహుళజాతి సంస్థలు తమ తమ కార్యాలయపు అకౌంట్లను చార్టర్డ్ అకౌంటెంట్‌లచే తనిఖీ చేయించి సంబంధిత శాఖలకు సమర్పించాల్సి ఉంటుంది. కంపెనీ అక్రమాలు, అవకతవకలు ఆడిట్‌లో బహిర్గతం అవుతాయి. అందువల్ల ఆడిటర్ ఇచ్చే సర్టిఫికెట్ ఆధారంగా ఆయా సంస్థలపై విశ్వసనీయత ప్రజల్లో ఏర్పడుతుంది. దేశ ఆర్ధిక వ్యవహారాలలో పర్యవేక్షణ, నియంత్రణ కోసమై చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సుకు డిజైన్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version