- నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు.. చివరి తేది ఫిబ్రవరి 4
- ఇంటర్వ్యూలు ఉండవు.. పైరవీలను నమ్మకండి : సీఎండీ
హైదరాబాద్ః ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తాజాగా సింగరేణిలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయడానికి సదరు సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి విడుతలో భాగంగా 372 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 128 ఫిట్టర్, 51 ఎలక్ట్రీషియన్, 54 వెల్డర్, 22 టర్నర్/మెషినిస్ట్, 14 మోటారు మెకానిక్, 19 ఫౌండ్రీమెన్/మౌల్డర్, 84 జూనియర్ స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే, రెండో విడుతలో భాగంగా 651 పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. అయితే, రెండో విడుత ఖాళీల భర్తీ మార్చి చేపడతామని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రకటించారు.
తాజా నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం ఏడు విభాగాల్లో 372 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. వీటిలో 305 పోస్టులను లోకల్ కేటగిరిలో.. అంటే సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మానికి చెందిన అభ్యర్థులకు కేటాయించారు. వాటిలో 105 ఫిట్టర్, 43 ఎలక్ట్రీషియన్, 44 వెల్డర్, 18 టర్నర్/మెషినిస్ట్, 16 ఫౌండ్రీమెన్/మౌల్డర్, 67 స్టాఫ్ నర్స్, 12 మోటార్ మెకానిక్ పోస్టులు ఉన్నాయి. ఇక మిగిలిన 67 పోస్టులకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అర్హులేనని పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు శుక్రవారం మధ్యా హ్నం 3 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయం త్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని తెలిపారు. అర్హతల సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.200 గా ఉంది. ఇక ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి 30 ఏండ్లు కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరో ఐదేండ్ల వరకు సడలింపునిచ్చారు. మరిన్ని వివరాలకు www.scclmines.com సైట్‌ను లాగిన్ అవ్వండి.
నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ అన్నారు. అయితే, ఉద్యోగాలు కల్పిస్తామనే పైరవీలను నమ్మవద్దని ఆయన సూచించారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.