శ్రీకృష్ణుడికి 16వేల మంది భార్యలు ఉండేవారని అందరికీ తెలిసిందే. అయితే కృష్ణుడికి నిజానికి అంతకు ముందే 8 మంది భార్యలు ఉన్నారు. వారిని కృష్ణుడి అష్ట భార్యలు అని కూడా పిలుస్తారు.
శ్రీకృష్ణుడికి 16వేల మంది భార్యలు ఉండేవారని అందరికీ తెలిసిందే. నరకాసురుని చెరలో ఉన్న 16వేల మంది యువ రాణులను విడిపించినప్పుడు వారు కృష్ణున్ని భర్తగా ఉండమని వేడుకుంటే.. అందుకు కృష్ణుడు అంగీకరించి వారిని పెళ్లి చేసుకుంటాడు. దీంతో కృష్ణుడికి 16వేల మంది భార్యలు ఏర్పడతారు. అయితే కృష్ణుడికి నిజానికి అంతకు ముందే 8 మంది భార్యలు ఉన్నారు. వారిని కృష్ణుడి అష్ట భార్యలు అని కూడా పిలుస్తారు. వారి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. రుక్మిణి
రుక్మిణి శ్రీకృష్ణున్ని ఎంతగానో ప్రేమిస్తుంది. ఆయననే తన భర్త అనుకుంటుంది. కానీ ఆమె తండ్రి భీష్మకుడు మాత్రం ఆమెను శిశుపాలుడికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంటాడు. అయితే తనను ఎలాగైనా పెళ్లి చేసుకోమ్మని, లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని రుక్మిని కృష్ణుడికి కబురు పంపుతుంది. దీంతో కృష్ణుడు ఆగమేఘాల మీద వచ్చి రుక్మిణిని ఎత్తుకెళ్లిపోయి ఆమె సమ్మతితో ఆమెను ద్వారకలో వివాహం చేసుకుంటాడు.
2. సత్యభామ
సత్యభామ అంతకు ముందు జన్మలో ఎలాగైనా సరే శ్రీమహావిష్ణువుకు భార్య కావాలని తీవ్రమైన తపస్సు చేస్తుంది. అయితే ఆమెకు విష్ణువు ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు. దీంతో ఆమె కృష్ణావతారంలో ఆయనకు భార్య అవుతుంది.
3. జాంబవతి
శ్రీకృష్ణుడిపై శమంతకమణి దొంగిలించాడనే నింద పడుతుంది. దాన్ని ఆయన తీయకపోయినా సత్రాజిత్తు కృష్ణుడే దొంగిలించాడని అపవాదు వేస్తాడు. దీంతో మణి కోసం కృష్ణుడు వెదుకుతుండగా, అది జాంబవంతుడి వద్ద ఉందని తెలుస్తుంది. దీంతో కృష్ణుడు జాంబవంతుడు ఉన్న గుహకు వెళ్లి అతనితో 28 రోజుల పాటు యుద్ధం చేసి అందులో గెలుస్తాడు. ఈ క్రమంలో జాంబవంతుడు తన వద్ద ఉన్న ఆ మణితోపాటు తన కూతురు జాంబవతిని ఇచ్చి కృష్ణుడికి వివాహం జరిపిస్తాడు.
4. కాళింది
సూర్యుని కుమార్తె కాళింది విష్ణువుకు భార్య అవ్వాలని ఘోరమైన తపస్సు చేయగా ఆమె తపస్సుకు మెచ్చి విష్ణువు వరం ప్రసాదిస్తాడు. దీంతో ఆమె కృష్ణావతారంలో మరో జన్మ ఎత్తి ఆయన్ను వివాహం చేసుకుంటుంది.
5. మిత్రవింద
అవంతీపుర రాజ్యానికి చెందిన రాజు సోదరి మిత్రవిందను కృష్ణుడు వివాహం చేసుకుని తన 4వ భార్యగా స్వీకరిస్తాడు.
6. నాగ్నజితి
కోసల రాజ్య యువరాణి ఈమె. ఈమె కూడా కృష్ణుడికి భార్య అవుతుంది.
7. భద్ర
కేకేయ రాజ్యానికి చెందిన దృష్టకేతు అనే రాజు కుమార్తె భద్ర. ఆమెను శ్రీకృష్ణుడి 7వ భార్య అని కొన్ని పురాణాలు చెబుతాయి. కొన్నింటిలో 8వ భార్య అని ఉంటుంది.
8. లక్ష్మణ
మద్ర రాజ్యానికి చెందిన రాజు కుమార్తె లక్ష్మణ. ఈమెకు పెళ్లి చేసేందుకు తండ్రి స్వయం వరం ఏర్పాటు చేస్తాడు. దానికి కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, జరాసంధుడు వస్తారు. అయితే అర్జునుడు విల్లుతో లక్ష్యాన్ని ఛేదించడంలో కావాలనే విఫలమవుతాడు. ఇక దుర్యోధనుడు, జరాసంధులు కూడా ఆ పరీక్షలో విఫలమవుతారు. కానీ కృష్ణుడు బాణాన్ని సంధించి లక్ష్యాన్ని ఛేదిస్తాడు. దీంతో ఆయన స్వయంవరంలో లక్ష్మణను వివాహం చేసుకుంటాడు.