కరోనా వైరస్ వల్ల ఇప్పటికే అనేక రంగాలకు చెందిన వారికి తీవ్రమైన నష్టం కలుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా ప్రభావం వల్ల హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న దాదాపు 10వేల మంది తాత్కాలిక ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. కరోనా వల్ల మార్చి 31వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో బార్లు, స్కూల్స్, సినిమా థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆయా ప్రదేశాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉపాధి లేక లబోదిబోమంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30 శాతం వరకు మద్యం అమ్మకాలు బార్లలోనే జరుగుతుండగా, హైదరాబాద్‌లో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లలోనూ మద్యం అమ్మకాలు భారీగానే జరుగుతున్నాయి. అయితే మార్చి 31వ తేదీ వరకు బార్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తాత్కాలికంగా ఉపాధి కోల్పోయారు. ఇక మార్చి 31వ తేదీ తరువాత అయినా బార్లు ఓపెన్ అవుతాయా, లేదా.. అనేది సందేహంగా మారింది. అయితే ముందు ముందు పరిస్థితి మారితే తిరిగి ఎప్పటిలాగే అన్నీ ఓపెన్ అవుతాయి కనుక కార్మికులకు కొంత వరకు నష్టం కలిగినా మళ్లీ వారి ఉపాధికి ఢోకా ఉండదు. కానీ ఆ పరిస్థితి వస్తుందా, రాదా అనేది సందేహంగా మారింది. కానీ ప్రస్తుతం మాత్రం వారి ఉపాధి పోవడంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.
మరోవైపు బార్ అండ్ రెస్టారెంట్లు, క్లబ్‌లను మూసివేయడంతో ఇప్పటికే రూ.600 కోట్ల నష్టం వాటిల్లగా, ముందు ముందు కరోనా ప్రభావం తగ్గకపోతే నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని ఆయా వ్యాపారాల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే మార్చి 31వ తేదీ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి..!