కరోనా వైరస్ చైనాలోని వూహాన్ సిటీలో ఉన్న వైరాలజీ ల్యాబ్‌లో మొదటగా పుట్టిందని, దాన్ని చైనాయే కావాలని సృష్టించి ప్రపంచం మీదకు వదిలిందని.. ప్రపంచమంతా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా కరోనాను చైనా వైరస్ అంటూ.. చైనా వ్యవహార శైలిని దుయ్యబడుతున్నారు. అయితే ట్రంప్ ఆరోపణలకు బలం చేకూర్చేలా.. ఇప్పుడు ఏకంగా ఓ నోబెల్ గ్రహీతే.. చైనాపై ఆరోపణలు చేస్తున్నారు.
ఫ్రాన్స్‌కు చెందిన నోబెల్ అవార్డు గ్రహీత, వైరాలజిస్టు లుక్ మాంటాగ్నియర్ తాజాగా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనాపై సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వైరస్ మనిషి సృష్టించిన వైరసేనని.. దాన్ని చైనాలోని వూహాన్ నేషనల్ బయోసేఫ్టీ ల్యాబ్‌లో తయారు చేశారని.. చైనా దాన్ని ప్రపంచం మీదకు కావాలనే వదిలిందని.. మాంటాగ్నియర్ అన్నారు. ఈయన ఎయిడ్స్ వైరస్‌ను కనుగొన్నందుకు గాను 2008లో నోబెల్ అవార్డు వరించింది. కాగా మరోవైపు అమెరికాతోపాటు అటు యూకే కూడా చైనాపై ఎదురుదాడి మొదలు పెట్టింది.
ప్రముఖ మీడియా సంస్థ ఫాక్స్ న్యూస్ ఇప్పటికే తన వెబ్‌సైట్లలో చైనాపై వరుస కథనాలను రాస్తోంది. కరోనా వైరస్‌ను చైనాయే సృష్టించిందని, అక్కడ ఆ విషయం బయట పెట్టాలని చూసిన డాక్టర్లు, జర్నలిస్టులను ఆ దేశ ప్రభుత్వం మాయం చేస్తుందని.. ఆరోపిస్తూ పలు వరుస కథనాలను వెబ్‌సైట్‌లో ఉంచుతోంది. అయితే ఈ విషయంపై నిజా నిజాలు ఎప్పటికి తెలుస్తాయో వేచి చూడాలి..!