కోవిడ్ అనుభవం ఉన్న అభిషేక్ బచ్చన్ మాటలు విని తీరాల్సిందే..

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కోవిడ్ నుండి కోలుకున్న సంగతి తెలిసిందే. జులై 11వ తేదీన టెస్ట్ చేయించుకున్న అభిషేక్ బచ్చన్, తనకి కరోనా సోకిందని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. తండ్రి అమితాబ్ కి కూడా కరోనా సోకిందని తెలిపాడు. వీరిద్దరూ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకున్నారు. ఐతే అమితాబ్ త్వరగా కోలుకుని ఇంటికిరాగా అభిషేక్ మాత్రం చాల రోజులు కరోనాతో పోరాడాల్సి వచ్చింది.

ఐతే కోవిడ్ తో పోరాడిన అనుభవం ఉన్న అభిషేక్ బచ్చన్, కరోనా పట్ల తేలికగా ఉండకూడదని, మనకేం కాదులే అని లైట్ తీసుకోవద్దని వారించాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న వీడియోలో మాట్లాడిన అభిషేక్, మాస్క్ పెట్టుకోవడం మర్చిపోవద్దని, ఎల్లప్పుడూ మాస్క్ మీ వద్దే ఉంచుకోమని, బయటకి వెళ్ళినపుడు గానీ, ఎవరితో అయినా ఉన్నప్పుడు గానీ మాస్క్ ఖచ్చితంగా ధరించాలని సలహా ఇచ్చాడు. ఈ వీడియోలో కూడా అభిషేక్ బచ్చన్ మాస్క్ తో కనిపించాడు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో అభిషేక్ చెప్పిన జాగ్రత్తలు చాలా ఉపయోగకరమైనవి.