ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం 7వ స్థానానికి చేరుకుంది. ఇందుకును భారత్.. ఫ్రాన్స్, జర్మనీలను దాటి పైకి ఎగబాకింది. ఆదివారం ఒక్క రోజే దేశంలో 8,392 కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. కాగా లాక్‌డౌన్ ఆంక్షలకు సడలింపులు ఇస్తున్నప్పటి నుంచి భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం ఆందోళనను కలిగిస్తోంది.
కోవిడ్19 ఇండియా లెక్కల ప్రకారం.. భారత్‌లో సోమవారం నాటికి మొత్తం 1,90,791 కరోనా కేసులు నమోదు కాగా 5,408 మంది చనిపోయారు. కేవలం ఒక్క రోజులోనే 230 మంది కరోనా కారణంగా చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మొత్తం 48.19 శాతం మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది.
మొత్తం 230 మరణాల్లో మహారాష్ట్రలో 89 చోటు చేసుకోగా, ఢిల్లీలో 57, గుజరాత్‌లో 31, తమిళనాడులో 13, ఉత్తర ప్రదేశ్‌లో 12, పశ్చిమ బెంగాల్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 7, తెలంగాణలో 5, కర్ణాటకలో 3, ఏపీలో 2, బీహార్, పంజాబ్, రాజస్థాన్‌లలో ఒక్కొక్కటి చొప్పున కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి.
ఇక మొత్తం మరణాల్లో మహారాష్ట్ర టాప్ ప్లేసులో ఉండగా, తరువాతి స్థానాల్లో గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు నిలిచాయి. కాగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లోని హాట్‌స్పాట్‌ల నుంచే ఎక్కువగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.