కోవిడ్ వ్యాక్సిన్‌ కోసం ఆ నెంబర్ తప్పనిసరి

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తుంది. అయితే కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వీలైనంత వేగంగా చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కూడా నిన్న జరిగిన సమీక్షలో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. కాగా దేశవ్యాప్తంగా మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇస్తున్న విషయం తెల్సిందే. అయితే 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారు వ్యాక్సిన్‌ కోసం కొవిన్‌ పోర్టల్‌ లేదా ఆరోగ్య సేతు యాప్ లో తప్పనిసరి రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

 

కాగా చాలా మందికి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో అవగాహన లేకపోవడంతో రిజిస్టర్‌ చేసుకోలేకపోతున్నారు. కొంత మంది ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్నా… షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లడం లేదు. ఇలాంటి సందర్భాలలో షెడ్యూల్ ముగిసిన తర్వాత సదరు వ్యక్తులు వ్యాక్సిన్‌ తీసుకోకపోయినా వ్యాక్సినేషన్‌ పూర్తయింది అంటూ వారి రిజిస్టర్డ్ మొబైల్‌ నెంబర్ కు మెసేజ్‌ వస్తోంది.

అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కొవిన్‌ పోర్టల్‌లో పలు మార్పులు చేసింది.వ్యాక్సిన్‌ కోసం రిజిస్టర్‌ చేసుకున్న సమయంలో రిజిస్టర్డ్ మొబైల్‌ నెంబర్ కు నాలుగు డిజిట్ల సెక్యూరిటీ కోడ్‌ వచ్చేలా కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఇక వ్యాక్సినేషన్‌ సమయంలో ఆ సెక్యూరిటీ కోడ్‌ కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. సెక్యూరిటీ కోడ్‌ చెబితేనే వ్యాక్సిన్‌ ఇస్తారు. లేకుంటే ఇవ్వరు. దీని ద్వారా షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్ళని వ్యక్తులకు వ్యాక్సినేషన్‌ కంప్లీటెడ్‌ అనే మెసేజ్ వెళ్ళదు. అలానే ఈ కొత్త ఆప్షన్ సెక్యూరిటీ పరమైన లోపాలను, వ్యాక్సిన్‌ దుర్వినియోగాన్ని అధిగమించేందుకు ఉపయోగపడుతుందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.