రేపటితో ముగియనున్న కర్ఫ్యూ… హైకోర్టు అసహనం

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు అప్పటికప్పుడూ విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇక గురువారం కూడా కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది. రేపటితో రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ ముగుస్తుందని మరి తదుపరి చర్యలు ఏంటని ప్రశ్నించింది.

 

దీనిపై స్పందించిన ప్రభుత్వం పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని సమాధానమిచ్చింది. ప్రభుత్వ సమాధానంతో అసంతృప్తి చెందిన ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. చివరి నిమిషంలో నిర్ణయాలు ఎందుకు? అని మండిపడింది. కనీసం ఒకరోజు ముందు చెబితే నష్టమేంటి? అని వ్యాఖ్యానించింది. నియంత్రణ చర్యలపై ఎలాంటి దాపరికాలు వద్దని రాష్ట్రంలో క్షేత్ర స్థాయి పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘంపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలు ఎందుకు అని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? అని ఎస్‌ఈసీపై ఫైర్ అయింది. కొన్ని మున్సిపాలిటీలకు ఇంకా సమయం ఉన్న ఎందుకు ఎన్నికలకు పూనుకున్నారని ప్రశ్నించింది. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి లేదా? అని ప్రశ్నించడంతో పాటు ఎన్నికల ప్రచారం సమయం కూడా కుదించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల నేపథ్యంలో అధికారులు కరోనా కట్టడిని పక్కన పెట్టి ఎన్నికల పనులు చూసుకునే పరిస్థితి తలెత్తిందంటూ మండిపడింది.