ఇండియానే కాదు.. యావత్ ప్రపంచమూ కోవిడ్ 19పై సుదీర్ఘకాలం పాటు పోరాటం చేయాలని, అందుకు అనుగుణంగా వ్యూహాలను రచించి అమలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్టు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆమె వివరాలను వెల్లడించారు. భారత్‌లో కరోనా ఇప్పటికీ నియంత్రణలో ఉందన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించాక కరోనా కేసులు భారీగా పెరిగినప్పటికీ భారత్‌లో పరిస్థితి ఇంకా అదుపులోనే ఉందన్నారు. 2021 ప్రథమార్థం వరకు కరోనాకు వ్యాక్సిన్ కచ్చితంగా వస్తుందని, దాన్ని విడతల వారీగా అన్ని దేశాలకూ పంపిణీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ప్రజలు కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్నారు.
కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆమె అన్నారు. ప్రపంచ జనాభాలో కేవలం కొద్ది మంది మాత్రమే ఈ వైరస్‌కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీని కలిగి ఉన్నారని, కానీ మెజారిటీ ప్రజలకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అనేక దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండేదని, లాక్‌డౌన్ అమలు చేస్తూ, కఠిన చర్యలు తీసుకుంటున్న మూలంగా ఆయా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. భారత్‌లో జనాభా ఎక్కువగా ఉన్నందున మనం కరోనాతో ఎక్కువ కాలం పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు. లాక్‌డౌన్‌లు కేవలం కొంతకాలం పాటు మాత్రమే పనికొస్తాయని, అవి సుదీర్ఘకాలానికి పరిష్కారాలు కావని అన్నారు. కరోనాను కట్టడి చేయాలంటే దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమన్నారు. ముఖ్యంగా వైద్య రంగంలో ప్రజలకు కావల్సిన మౌలిక సదుపాయాలను ఇంకా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
భారత్‌లో లాక్‌డౌన్‌ను అమలు చేసినప్పుడు కరోనా అదుపులోనే ఉన్నా.. ప్రస్తుతం కేసులు పెరుగుతున్నాయన్నారు. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే కేసుల సంఖ్య పెరుగుదల రేటు, మరణాల రేటు తక్కువగానే ఉందన్నారు. అయితే ప్రస్తుతానికి మనముందు ఉన్న అతి పెద్ద సవాల్.. మరణాల రేటును వీలైనంత వరకు తగ్గించడమేనని తెలిపారు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగు పరిస్తే కరోనా మరణాల రేటును ఇంకా తగ్గించవచ్చన్నారు. కరోనా వల్ల ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స అందించడం ప్రస్తుతం నిలిపివేశారని, కానీ ఆ సేవలను కూడా ప్రారంభించాలని అన్నారు.
నవంబర్ వరకు భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అవి కేవలం ఊహించి చెబుతున్న లెక్కలేనని.. ప్రస్తుతం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని, అప్పటి వరకు కేసులు తగ్గవచ్చు లేదా పెరగవచ్చని అన్నారు. కానీ కరోనాను కట్టడి చేసే దిశగానే ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. ఇక పతంజలి సంస్థ తయారు చేసిన కరోనైల్ మెడిసిన్‌పై ఆమె స్పందిస్తూ.. ఆయుర్వేద లేదా ఇతర ఏ వైద్య విధానానికి చెందిన మెడిసిన్ అయినా సరే.. శాస్త్రీయ ఆధారాలు ఉంటే ఆ మెడిసిన్‌ను చికిత్స కోసం వాడవచ్చని తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ల కోసం అనేక ఫార్మా కంపెనీలు, సైంటిస్టులు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు చేస్తున్నా.. అనేక ప్రయోగాలు ప్రస్తుతం ఫేజ్ 1, 2 దశల్లోనే ఉన్నాయని, రాబోయే 6 నుంచి 12 నెలల కాలంలో ఆ వ్యాక్సిన్లు మనకు అందుబాటులోకి వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కనుక 2021 ఆరంభం నుంచి మనం వ్యాక్సిన్లను పొందవచ్చని అన్నారు. ఇక కరోనాపై నిత్యం సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ఫేక్ వార్తలను నమ్మకూడదని ఆమె తెలిపారు.
కరోనా లక్షణాలు అసలు ఏమాత్రం లేని వారు (అసింప్టమాటిక్), ఇప్పుడు లక్షణాలు లేకుండా తరువాత లక్షణాలు కనిపించే వారు (ప్రీ-సింప్టమాటిక్) కూడా కరోనాను వ్యాప్తి చెందిస్తారని ఆమె తెలిపారు. కనుక ప్రజలు మాస్కులను కచ్చితంగా ధరించాలన్నారు. అయితే కొందరు మాస్కులను లూజ్‌గా, కొందరు ముక్కు కిందకు ధరిస్తున్నారని, ఇలా చేయకూడదని, మాస్కులను బిగుతుగా నోరు, ముక్కులను కవర్ చేసే విధంగా ధరించాలని సూచించారు. దీంతో కరోనా వ్యాప్తిని చాలా వరకు అడ్డుకోవచ్చని తెలిపారు.
గర్భంతో ఉన్న స్త్రీలు మరింత శుభ్రంగా ఉండాలని, పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, తమకు తాముగా రక్షణ చర్యలు పాటించాలని అన్నారు. గర్భంతో ఉన్న కొందరు స్త్రీలకు కరోనా పాజిటివ్ వస్తున్నప్పటికీ కొందరు మాత్రం ఆరోగ్యంగా, కరోనా పాజిటివ్ లేని శిశువులకు జన్మనిస్తున్నారని.. కనుక ఇందులో ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.