మదర్స్ డే: ప్లస్ ఆర్ మైనస్ .. రైట్ ఆర్ రాంగ్ .. హఠెన్ ఠాఠ్.. వాట్ ఏ థాట్ .. జన్మ ఒక్కటే .. జనని ఒక్కరే.. వైరాగ్యం కాదు..వేదనకు ఇది అంతిమ స్థానమూ కాదు కానీ ఎందుకనో అమ్మ ని మించిన అమ్మ ఎక్కడా లేదెందుకని? దయచేసి అడగకు ప్రార్థించకు.. అభ్యర్థించకు.. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరినీ అడుగకు.డిగ్రీ / పీజీలు ఫ్రాఫిట్ లు / డివిడెండ్‌లు ఈ గోలెందుకు కానీ అచ్ఛంగా ఆమెను అర్థం చేసుకుంటున్నదెందరని? మనమంతా ఓ మాయలో కాదు ఓ రొచ్చులో కొట్టుమిట్టాడుతూ దీనికే నాగరికత అని పేరుపెట్టుకుని తెగ హడావిడి చేస్తున్నమేమిటో.. ఎవడో సంస్థకి ఉద్యోగం పేరిట ఊడిగం చేస్తాం.ఎక్కడో ఉన్న అమ్మ కోసం ఈ రోజనే కాదు ఏ రోజూ ఓ క్షణం కేటాయించం.అదేంటో ఇవేవీ పట్టవు ఆమెకు. ట్రూ లవ్ ఉందంటారా అని ఎవడన్నా అంటే నాల్గు తన్ని కాలరెగరేయ బుద్ధేస్తది.
వీధి చివర బిచ్చమెత్తుకు తిరిగే అమ్మ కూడా మన అమ్మే కదా! మరి! ఆ మాత్రం సాయం కూడా చేయక .. ఆమెనో నీడ పంచన చేర్చక ఎవడి మానాన వాడు బతికేస్తున్నాడే..! ఆత్మ వంచన కాదా ఇది. ఇది కూడా పతనమే. అదిగదిగో ఫ్లై ఓవర్ కిందొక తల్లి నలుగురు పిల్లలతో నగరానికి వచ్చిందట.ఆడ పిల్లలు పుట్టారని మొగుడు వదిలేశాడట! “ఈనాడు ” కెమెరాకు చిక్కి పాలక ప్రభువుల పుణ్యమాని క్షేమంగా ఇంటికి చేరింది. అలా ఎందరెందరు చేరుతున్నారని.. ఎందరెందరి సమస్య పరిష్కారానికి నోచుకుంటుందని? ఎందరు ఆకలి తీరుతున్నదని..?
కవిత్వానికి ఏముంది కానీ అంతా ఓ రొచ్చు.వరమిచ్చే శాపం అమ్మ.. కరుణించే కోపం అమ్మ.. ఇలా ఎన్నైనా చెప్పవచ్చు గాక కానీ ఆచరణ యోగ్యతకు విలువివ్వని మను షులంటే పరమ అసహ్యం. ఔను! వీళ్లూ మనుషులే.. గాజు కళ్ల గుడ్డి లోకంలో.. ఔను! వీళ్లే మనుషులు .. రంగురంగుల లోకంలో.. కాకులమ్మ.. కోయిలమ్మ ఇచటే కలదు. పిశాచ గణ సమవాకారాలూ ఇక్కడే కలవు. రండి ఏరుకుందాం