1995లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించేందుకు మోదీ ఎంతో కష్టపడినందుకు గాను ఆయనకు బీజేపీ జాతీయ కార్యదర్శి పదవి ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన మకాం గుజరాత్ నుంచి ఢిల్లీకి మారింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఒకప్పుడు టీ స్టాల్ నడుపుకునే వారని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆయన కష్టపడి పైకొచ్చారు. దేశ ప్రధాని అయ్యారు. అయితే ఆయన 8 సంవత్సరాల వయస్సులో ఉండగానే ఆయన్ను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆకర్షించింది. అందులో అప్పుడే ఆయన చేరారు. ఆ తరువాత 1971లో ఆయన ఆర్ఎస్ఎస్లో పూర్తి స్థాయిలో పనిచేశారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు మోదీ అండర్ గ్రౌండ్లో కొన్నాళ్లు ఉండాల్సి వచ్చింది. అయితే 1985లో ఆయనను ఆర్ఎస్ఎస్ బీజేపీలో చేర్పించింది. అక్కడి నుంచి మోదీ రాజకీయ ప్రస్థానం మొదలైంది.
బీజేపీలో మోదీ అంచెలంచెలుగా ఎదిగారు. సాధారణ కార్యకర్తగా మొదలైన ఆయన ప్రయాణం కీలక పదవులను చేపట్టే వరకు సాగింది. 1987లో అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సునాయాస విజయం సాధించడం వెనుక మోదీ కృషి ఎంతగానో ఉంది. దీంతో మోదీ ఆ తరువాత గుజరాత్ బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయ్యారు. అనంతరం 1990లో బీజేపీ నేషనల్ ఎలెక్షన్ కమిటీలో మోదీ సభ్యుడయ్యారు. ఈ క్రమంలోనే అదే ఏడాది ఎల్కే అద్వానీ చేపట్టిన రామ్ రథ్ యాత్రకు, 1991-92లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన ఏక్తా యాత్రకు మోదీ కార్యనిర్వాహకుడిగా పనిచేశారు. 1992 నుంచి 1994 వరకు పలు వ్యక్తిగత కారణాల వల్ల బీజేపీకి దూరంగా ఉన్న మోదీ ఆ తరువాత మళ్లీ పార్టీలోకి వచ్చి రాజకీయాల్లో చురుగ్గా పనిచేశారు.
1995లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించేందుకు మోదీ ఎంతో కష్టపడినందుకు గాను ఆయనకు బీజేపీ జాతీయ కార్యదర్శి పదవి ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన మకాం గుజరాత్ నుంచి ఢిల్లీకి మారింది. 1998లో గుజరాత్లో పలు కారణాల వల్ల ప్రభుత్వం కూలిపోతే వచ్చిన ఎన్నికల్లోనూ మళ్లీ బీజేపీనే ఘన విజయం సాధించేలా మోదీ వ్యూహాలు రచించారు. దీంతో మోదీ అదే ఏడాది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. అనంతరం 2001లో అప్పటి గుజరాత్ చీఫ్ మినిస్టర్ కేశూభాయ్ పటేల్ అనారోగ్యం పాలు కావడం, బై ఎలక్షన్లలో పలు అసెంబ్లీ సీట్లను బీజేపీ కోల్పోవడం, భుజ్‌లో వచ్చిన భూకంపం బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టడంలో విఫలమవడంతో పటేల్‌ను సీఎంగా తప్పించిన బీజేపీ అధిష్టానం మోదీని గుజరాత్ సీఎంగా నియమించింది.
ఇక అప్పటి.. అంటే.. 2001 అక్టోబర్ 7 నుంచి 2014 మే 22వ తేదీ వరకు మోదీ గుజరాత్ సీఎంగా దాదాపుగా 12 ఏళ్ల 7 నెలల పాటు పనిచేసి రికార్డు సృష్టించారు. అనంతరం 2014తోపాటు మొన్నీ మధ్యే జరిగిన 2019 దేశ వ్యాప్త సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అత్యధిక సీట్లను బీజేపీ సాధించి మోదీ మళ్లీ ప్రధాని అయ్యారు. కాగా 1984 నుంచి 2014 వరకు కేంద్రంలో ఏ పార్టీకి అంత భారీ మెజారిటీ రాలేదు. సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కానీ 2014లో మోదీ ప్రధానిగా పోటీ చేశాక బీజేపీ భారీ మెజారిటీతో ఇతర పార్టీల అవసరం లేకుండానే సింగిల్‌గానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే ఫీట్‌ను 2019 ఎన్నికల్లోనూ బీజేపీ సాధించింది. అయితే ఇదంతా మోదీ చలవే అని చెప్పవచ్చు. ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానం, నమ్మకమే ఆయన్ను రెండో సారి ప్రధానిని చేశాయి..!