కదిలే బస్సు కానీ.. రైలు కానీ ఎక్కడం ఎంత డేంజరో అందరికీ తెలుసు. కానీ.. దాన్ని పాటించేవాళ్లు మాత్రం చాలా తక్కువ. దాని వల్ల ఒక్కోసారి ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి ఘటనే ఒకటి ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్నది. కదిలే రైలు ఎక్కబోయి ఉత్తిపుణ్యానికి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృత్యువాత పడ్డాడు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన చౌదరి ఐబీఎంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నాడు. కానీ.. ఇంతలోనే చౌదరిని మృత్యువు పలకరించింది. ముంబై శివారులోని కర్జత్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లేందుకు పయనమయ్యాడు. తెల్లవారుజామునే దాదర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. కానీ.. అప్పటికే ట్రెయిన్ కదిలింది. దీంతో ఆ ట్రెయిన్ మిస్సయితే మరోటి దొరుకుతుందో లేదో అని దాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు. ఫుట్‌బోర్డ్ పట్టుకొని ఎక్కబోయాడు. కానీ.. దురదృష్టవశాత్తు…అతడు పట్టు తప్పి రైలు కింద పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.