30 గంటలు బావిలోనే.. నరకయాతన అనుభవించి.. మృత్యుంజయుడయ్యాడు..!

ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున 3.30 కు చోటు చేసుకున్నది. బావిలో ఉన్న నీళ్లలో రాజమొగిలి పడిపోవడంతో ఈదుకుంటూ వెళ్లి బావిలో ఉన్న మోటర్ పైపును ఆసరాగా చేసుకున్నాడు. ఎవరైనా రక్షించాలంటూ గట్టిగా అరిచాడు. కానీ.. అక్కడ చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు.

బావిలో సరదాగా ఎంత సేపు ఈత కొట్టగలం చెప్పండి. మా.. అంటే ఓ గంట, రెండు గంటలు.. కానీ.. ఈ వ్యక్తి మాత్రం ఏకంగా వ్యవసాయ బావిలో 30 గంటలు ఉన్నాడు. నీళ్లలోనే 30 గంటల పాటు నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని.. బావిలోని పాములకు భయపడుతూ ప్రతి క్షణం చావు భయంతో గడిపాడు. కానీ.. అతడి ఆత్మస్థయిర్యం ముందు చావు కూడా ఓడిపోయింది. అతడి ధైర్యమే అతడిని మృత్యుంజయుడిని చేసింది. ఆయనే రాజమొగిలి.

కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం మడిపల్లి ఆయన ఊరు. అడ్తీ వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల హన్మకొండలో బంధువుల ఫంక్షన్ కు హాజరై… తిరిగి తన ఊరికి బండి మీద వెళ్తున్నాడు మొగిలి. శుక్రవారం తెల్లవారుజామున వెళ్తుండగా… హసన్ పర్తి మండలం నాగారం క్రాస్ రోడ్ వద్ద.. అతడి బైక్ ను గుర్తు తెలియని వాహనం డీకొట్టింది. దీంతో బండితో సహా రాజమొగిలి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు.

ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున 3.30 కు చోటు చేసుకున్నది. బావిలో ఉన్న నీళ్లలో రాజమొగిలి పడిపోవడంతో ఈదుకుంటూ వెళ్లి బావిలో ఉన్న మోటర్ పైపును ఆసరాగా చేసుకున్నాడు. ఎవరైనా రక్షించాలంటూ గట్టిగా అరిచాడు. కానీ.. అక్కడ చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు.

శుక్రవారం తెల్లవారాక ఎవరైనా వస్తారేమో అని ఆయన భావించినా.. సాయంత్రం దాకా కూడా ఆ బావి వైపుకు ఎవ్వరూ రాలేదు. అయినప్పటికీ.. ఆయన తన దైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. రక్షించాలంటూ అరవసాగాడు. మరోవైపు బావిలోని పాములు ఆయనవైపు దూసుకు రావడంతో.. వాటిపై చెట్ల ఆకులు, కట్టెపుల్లలు విసిరేస్తూ వాటిని భయపెట్టి ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నాడు. శుక్రవారం రాత్రి మొత్తం కూడా అదే బావిలో గడిపాడు. చివరకు.. శనివారం ఉదయం 10 గంటల సమయంలో రాజిరెడ్డి అనే రైతుకు రాజమొగిలి అరుపులు వినిపించాయి. దీంతో వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా.. అందులో రాజమొగిలి ఉన్న విషయాన్ని గమనించాడు.

దీంతో అతడికి దైర్యం చెప్పి.. వెంటనే గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులను తీసుకొని వచ్చాడు. వెంటనే తాళ్లతో రాజమొగిలిని వాళ్లు పైకి లాగారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమొగిలి ఇంటికి వెళ్లిపోయాడు.

అలా.. దాదాపు 30 గంటల పాటు… రాజమొగిలి బావిలోనే ఉన్నాడు. ఈత రావడం, బావిలో ఉన్న మోటారు పైపును పట్టుకొని గడపడం వల్లనే రాజమొగిలి బతికి బయటపడ్డాడు.