178 యూనిట్లు వాడితే ఎంతొస్తుంది కరెంట్ బిల్లు. మా.. అంటే 500 వస్తుందేమో. కానీ.. ఈయనకు మాత్రం ఏకంగా 23 కోట్ల రూపాయల బిల్లు వచ్చింది. మీరు షాకయ్యారా? మీరే కాదు.. కరెంట్ బిల్లు వచ్చిన వ్యక్తి కూడా షాకయ్యారా? కరెంట్ షాక్ కొట్టిన వ్యక్తిలా గిలా గిలా కొట్టుకున్నాడు. ఆయన జీవితమే కాదు.. ఆయన తరాలు తరాలు సంపాదించినా ఆ బిల్లు కట్టలేడు. ఎందుకంటే.. అతడు ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులకు కోట్లు అనేవి అందని ద్రాక్షలే.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్‌లో చోటు చేసుకున్నది. అబ్దుల్ బాసిత్ అనే వ్యక్తి ఇంటికి వచ్చిన విద్యుత్ ఉద్యోగి మీటర్ రీడింగ్ చూసి కరెంట్ బిల్లు ఇచ్చి వెళ్లాడు. దాన్ని చూసి బాసిత్ కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే విద్యుత్ అధికారులను కలిశాడు బాసిత్.
ఆ కరెంట్ బిల్లును పరిశీలించిన అధికారులు.. టెక్నికల్ సమస్య వల్ల అలా బిల్లు వచ్చిందని.. దీనిపై విచారణ చేయిస్తామని.. అప్పుడప్పుడు సాంకేతిక సమస్యల వల్ల ఇటువంటి తప్పిదాలు జరుగుతాయని.. బాసిత్ అంత బిల్లు కట్టాల్సిన అవసరం లేదని.. ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక బాసిత్ బిల్లు కట్టొచ్చని విద్యుత్ అధికారులు తెలిపారు.