నీ డ్రెస్సు సరిగ్గా లేదు.. నిన్ను విమానం ఎక్కించుకోం.. ఎయిర్ పోర్ట్ లో ఓ యువతికి చేదు అనుభవం..!

విమానంలో ప్రయాణించడానికి ఏదైనా డ్రెస్ కోడ్ ఉంటుందా? ఉండదు కానీ.. సరైన డ్రెస్ వేసుకోవాలి కదా. మరీ.. బికినీలు లాంటి డ్రెస్సులు వేసుకొని విమానం ఎక్కుతామంటే నో వే.. అంటారు. అలాంటి ఘటనే ఒకటి యూకేలోని బర్మింగ్ హామ్ ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకున్నది.

 

ఎమిలి అనే 21 ఏళ్ల యువతి… థామస్ కుక్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించడానికి నల్లని టాప్ వేసుకొని బర్మింగ్ హామ్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లింది. విమానం ఎక్కడానికి ప్రయత్నించింది. కానీ.. ఆమెను విమాన సిబ్బంది అడ్డుకున్నారు. ఆమె వేసుకున్న డ్రెస్సు అభ్యంతరకరంగా ఉందని.. అది ఎయిర్ లైన్స్ నిబంధనలను అతిక్రమించడమేనని సిబ్బంది తెలిపారు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ యువతి.. వాళ్లతో వాగ్వాదానికి దిగింది. అయినప్పటికీ.. విమాన సిబ్బంది తనను విమానం లోపలికి అనుమతించలేదు. తోటి ప్రయాణికులు కూడా ఆమె వేసుకున్న డ్రెస్సుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక.. విమానం ముందు ఫోటో దిగి దాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎయిర్ లైన్స్ పై నిరసన తెలిపింది. దీంతో ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తర్వాత ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎయిర్ లైన్స్… తమ సిబ్బంది అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పింది. ఆ యువతిని విమానం ఎక్కించుకోని సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎయిర్ లైన్స్ వెల్లడించింది. దీంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది.