భోగి పండ్లు ఎలా పోయాలో తెలుసా..?

ఈసారి జనవరి 14న భోగి. అయితే భోగినాడు పది/పన్నెండ్లులోపు పిల్లలకు పండ్లు పోయడం ఆనవాయితీ. పిల్లలకు భోగి పళ్లు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి. అసలు పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు? అనే విషయం చాలామందికి తెలీదు. నర దిష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు. ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే.. వారికి అప్పటివరకూ ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగి పండ్లు పోయడంలో రహస్యం. సాయంత్రం సంది గొబ్బెలు పిల్లల చేత పెట్టించిన తర్వాత ఈ భోగి పళ్లు చేసే కార్యక్రమం మొదలుపెడతారు.

 

నిజానికి ఈ భోగిపళ్లు పోసే విషయంలో వయసుతో పనిలేదు. ఎవరికైనా పోయొచ్చు. కానీ… 12 ఏళ్ల లోపు పిల్లలకే ఎక్కువగా భోగిపళ్లు పోస్తారు. రేగి పళ్లు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు కలిపి ఉంచుతారు. వాటిని పిల్లడిపై పడేట్టు పోస్తారు. అలా పోసిన తర్వాత కింద బడ్డ రేగిపళ్లు తినడానికి నిషిద్దం. దాన్ని ఎవరూ లేని చోట పారేయడం చేస్తారు. అసలు పిల్లలకు భోగి పళ్ల పేరుతో రేగి పళ్లనే ఎందుకు పోస్తారు? అనేది కూడా చాలామందికి తెలీని విషయమే. రేగి పండును అర్కఫలం అని కూడా అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లుతాడు. అందుకే.. ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్లు పోస్తారు.

– కేశవ