దసరా ప్రత్యేకం శమీపూజ!!

దసరా ప్రత్యేకం శమీపూజ. శమీ అంటే జమ్మి. జమ్మిచెట్టు శక్తి స్వరూపం. పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీ వృక్షం పైనే దాచిపెట్టారు. ఈ సమయంలో విరాటరాజు కొలువులో ఉన్న పాండవులు.. ఏడాది షరతు పూర్తికాగానే ఆ వృక్షాన్ని ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను పొంది, శమీవృక్ష రూపంలోని అపరాజితా దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయం సాధించారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి దసరా నాడు సాయంత్రం వేళలో దేవాలయ ప్రాంగణాలలో, ఊరిలోని ప్రధాన కూడళ్లలో జమ్మికొమ్మను నాటి దాన్ని పూజించి అక్కడ జమ్మిని బంగారంగా అంటే పవిత్రంగా భావించి దాన్ని ఇంటికి తీసుకుని పోతారు. అంతేకాదు అక్కడికి వచ్చిన మిత్రులు, బంధువులు, గ్రామవాసులు అందరూ ఒకరికొకరూ అప్యాయంగా అలయ్‌బలయ్ తీసుకుంటారు. అప్పటి వరకు శత్రువులైనా దసరా జమ్మి దగ్గర మిత్రులుగా మారిపోతారు.

జమ్మిచెట్టు దగ్గర పఠించాల్సిన శ్లోకం
శమీ శమీయతే పాపం శమీ శత్రువినాశనం!
అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం!!
అనే శ్లోకాన్ని తెల్లని కాగితం పైన రాసి జమ్మి చెట్టు దగ్గర పెట్టి, మనసులో వారి వారి కోర్కిలను ఆ దుర్గా దేవికి తెలిపి, వాటిల్లో విజయం సాధించాలని ప్రార్థించాలి. అటు తర్వాత జమ్మిచెట్టుకు కనీసం మూడు ప్రదక్షణలు చేసి జమ్మి ఆకును తీసుకుని జేబులో వేసుకోవాలి. వీలైతే దేవుని దర్శనం, పెద్దల, పండితుల ఆశీర్వాదం తీసుకోవాలి. పేదలకు చాతనైనంత సహాయం చేయాలి. అంతేకాదు మిత్రులను, శ్రేయోభిలాషులకు అలయ్‌బలాయ్ తీసుకోవాలి.

– కేశవ