ఎండలు రోజురోజుకి మండిపోతున్నాయి. రోజులు పెరుగుతున్న కొద్దీ ఎండ వేడి పెరుగుతూ వస్తుంది. ఎండాకాలం తన ప్రభావాన్ని చూపించడానికి అన్ని విధాలా సిద్ధమైంది. ఈ సమయంలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పటికప్పుడు నీళ్ళు తాగుతూ శరీరంలో నీటిశాతాన్ని తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం పండ్లని ఆహారంగా తీసుకుంటే బాగుంటుంది. శరీరంలో నీటిశాతాన్ని పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పండ్లలో అతి ముఖ్యమైనది కర్బూజ.
మస్క్ మిలన్.. దీనిలో ఉండే పోషకాలు శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తాయి. డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. మలబద్దకం, మూత్ర సంబంధ సమస్యలు, అలసట, అధిక రక్తపీడనం మొదలగు వాటి నుండి కాపాడుతుంది. కేలరీలు తక్కువగా ఉండడం, విటమిన్ ఏ పుష్కలంగా లభించడం మొదలగు లాభాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ రుతువులో దొరికే అత్యంత మేలైన పండుని అస్సలు మిస్ కావద్దు.
ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్దకం దూరమవుతుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిని రక్తాన్ని కరిగించడంలో ఉపయోగపడుతుంది. కండరాల నొప్పిని తగ్గించి అనేక నొప్పులని దూరం చేస్తుంది. ఈ కర్బూజని మామూలుగా ముక్కలు కోసుకుని తినవచ్చు. లేదంటే జ్యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొందరైతే దీన్ని కూరలా చేసుకుని అన్నంలో కలుపుకుంటారు. ఎవరెలా తిన్నా ఇందులో ఉండే పోషకాలు మాత్రం అలాగే ఉంటాయి. ప్రత్యేకమైన రుతువులో దొరికే పండ్లలో ప్రత్యేకమైన పోషకాలుంటాయి. ఎండాకాలం ఎండ వేడిని తట్టుకోవడానికి ప్రకృతే కర్బూజని వరంలా ఇచ్చిందేమో! అందుకే ఏది మిస్సయినా ఫర్వాలేదు గానీ ఈ కర్బూజని మాత్రం అస్సలు మిస్సవకండి.