సాయంత్రం అవగానే ఏదైనా స్నాక్స్ తినడం మామూలే. ఆ సమయంలో ఏదైనా చిరుతిళ్ళు తినాలని అనిపిస్తుంటుంది. ఐతే చిరుతిళ్ళలో కూడా ఆరోగ్యానికి మేలు చేసేవి తీసుకుంటే అంతకంటే మంచిది ఏముంటుంది? జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ పక్కన పెట్టేసి శరీరానికి ఉపయోగపడే చిరుతిళ్ళని ఆహారంగా తీసుకోండి. అలాంటి ఆహారాలు ఏం ఉన్నాయని ఆలోచిస్తున్నారా?
శనగలు.. అవును, కాల్చిన శనగలని ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది. దీనిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆ మేలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి
కాల్చిన శనగల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల వాటిని తినడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. అదీగాక కడుపుని నిండుగా ఉంచుతుంది. దానివల్ల మీరు తక్కువ తింటారు.
రోగనిరోధక శక్తి పెంచడానికి
కాల్చిన శనగల్లో మెగ్నీషియం, థయామిన్, భాస్వరం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి. మహమ్మారి సమయంలో రోగనిరోధక శక్తి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
డయాబెటీస్ నియంత్రణ
ఇందులో గ్లైసమిక్ విలువ చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.
రక్తహీనత నివారణ
ఇందులో ఉండే అధిక ఐరన్ కారణంగా రక్తహీనత సమస్య దూరం అవుతుంది. మహిళల రుతుస్రావ సమయంలో వీటిని తినడం వల్ల మేలు జరుగుతుందని నిపుణులు సలాహా ఇస్తారు.
జీర్ణక్రియ మెరుగుపడడానికి
కాల్చిన శనగల్లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటివల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగవుతుంది. అంతేకాదు దీనివల్ల మలబద్దకం సమస్య దూరమవుతుంది.
అందుకే సాయంత్రం పూట స్నాక్స్ తినాలనుకుంటే అందులో కాల్చిన శనగలని చేర్చుకోండి.