రంజాన్ నెలలో ఎక్కువగా తినే ఖర్జూర ప్రాముఖ్యత తెలుసుకోండి..

ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ నెలలో ఖర్జూర పండుకి ఉన్న ప్రాముఖ్యత ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. పొద్దుటి నుండి సాయంత్రం వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా కఠిన ఉపవాస దీక్షను అవలంబించే ముస్లింలు, ఖర్జూర పండునే మొదటగా తింటారు. దానికి చాలా కారణాలున్నాయి. ఆ కారణాలేంటో తెలుసుకుని, ఖర్జూర పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలని తెలుసుకుందాం.

జమ్మూ కాశ్మీర్ లో ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంతగా ఖర్జూరం పండ్లు అమ్ముడవుతున్నాయట. ఈ మేరకు ANI న్యూస్ రిపోర్ట్ తెలిపింది. శ్రీనగర్ మార్కెట్లు పెద్ద ఎత్తున్న ఖర్జూర పండ్లతో నిండి ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా ఇంకా ఇజ్రాయెల్ దేశాల నుండి దిగుమతి అయిన అనేక రకాలు ఇక్కడ లభిస్తున్నాయి. ఒక దుకాణదారుడు మాట్లాడుతూ ఈ ఖర్జూరాలు చాలా బాగున్నాయి. ఇవి ప్రవక్త ప్రత్యేకమైన పండు. అందుకే దీన్ని తినమని అందరూ చెబుతుంటారు.

ఇతర మతాలకన్నా ఇస్లాంలో ఖర్జూర పండ్లని ఎక్కువగా తీసుకుంటారు. సౌదీ అరేబియాలోని మదీనా ప్రాంతంలో దొరికే ఖర్జూర పండ్లని ప్రవక్త స్వర్గం నుండి పంపించాడని అంటారు. ఖర్జూరాలు చాలా పోషకాలని కలిగి ఉన్నాయి. ఎండిన ఖర్జూరాలు అంతకంటే మేలైనవి. ఇందులో పిండి పదార్థాలు, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, ఐరన్ మరియు విటమిన్ బి6 ఉన్నాయి.

ఖర్జూరాల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు ఇంకా ఫినోలిక్ ఆమ్లాలు ఉన్నందువల్ల వ్యాధుల దరిచేరకుండా ఉంటాయి. ఇందులో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఇది చక్కెర నిల్వలు లేని తియ్యనైన పదార్థం. రక్తంలో చక్కెర నిల్వలని నియంత్రించడంలో సాయపడతాయి. ఖర్జూరాలు తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఖర్జూరాలని ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యకరం.