ఒత్తిడి ఎక్కువైనపుడు ఆహారం ఎక్కువ తినే అలవాటు చాలామందికి ఉంటుంది. దీనికి ముఖ్య కారణం మెదడులో స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ విడుదల కావడమే. ఈ హార్మోన్ వల్ల ఆకలిగా అనిపిస్తుంది.
ఆకలిగా అనిపించినప్పుడల్లా తింటే లేనిపోని సమస్యలు చుట్టుకుంటాయి. అందుకే ఒత్తిడిగా ఉన్నప్పుడు ఆహారం విషయంలో కంట్రోల్ గా ఉండాలి. దానికోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
నీళ్ళు తాగాలి:
ఒక్కోసారి దాహం వేసినా ఆకలి వేసినట్టు అనిపిస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ విధంగా అనిపించే అవకాశముంది. అందుకే ఆకలిగా అనిపించినపుడు గ్లాసు నిండా నీళ్ళు తాగండి. ఇది వర్కౌట్ అయ్యే అవకాశమే ఎక్కువ.
నెమ్మదిగా తినండి:
తినే వేగం తగ్గించండి. సాధారణంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు వేగంగా తింటారు. ఆ కారణంగా ఎక్కువ తినేస్తారు. మీరు మాత్రం నెమ్మదిగా, ఆహారాన్ని పూర్తిగా నమిలి తినండి. ఇలా చేస్తే మీరు ఎంత తింటున్నారో మీకు అర్థమై ఎక్కువ తినకుండా ఆగిపోతారు.
ఆలోచన మార్చండి:
మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే ఆలోచన నుండి డైవర్ట్ అవ్వండి. మంచి కామెడీ సినిమా చూడండి. స్టాండప్ కామెడీ ట్రై చేయండి. ఆలోచన మారిపోయినపుడు ఆకలి మీదకు మనసు వెళ్ళదు.
కఠిన నిర్ణయాలు తీసుకోవద్దు:
ఈరోజు ఎక్కువగా తిని రేపటి నుండి బాగా తగ్గించాలని అనుకోకండి. ఈ ప్లాన్ ఎప్పటికీ వర్కౌట్ కాదు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ తినే అవకాశమే ఎక్కువ.