భారత ఆల్‌రౌండ్ క్రికెట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా బంతితోనూ కాదు, అటు బ్యాట్‌తోనూ మరోసారి తన సత్తా చాటాడు. హ్యాట్రిక్ సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారత్ ఇప్పటికే 5 వన్డేల సిరీస్‌లో 3-1 తో ఆధిక్యంలో ఉండగా, చివరిదైన 5వ వన్డే ఇవాళ వెల్లింగ్టన్‌లో జరుగుతోంది. ఈ క్రమంలోనే భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే భారత ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కేవలం 22 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. వాటిలో హ్యాట్రిక్ సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో పాండ్యా 45 పరుగులు చేశాడు.
భారత ఇన్నింగ్స్‌లో 47వ ఓవర్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ ఆస్లే బౌలింగ్ వేయగా పాండ్యా మొదటి బంతికి పరుగులు చేయలేదు. కానీ ఆ తరువాత వరుసగా మూడు బంతులను పాండ్యా సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఆ ఓవర్‌లో భారత్‌కు 18 పరుగుల వచ్చాయి. కాగా ఇలా అన్ని ఫార్మాట్లలో కలిపి పాండ్యా హ్యాట్రిక్ సిక్సర్లు సాధించడం ఇది 5వ సారి. 2017లోనే పాండ్యా ఈ ఘనతను నాలుగు సార్లు సాధించాడు.
Hat trick sixes by Hardik Pandya pic.twitter.com/kPI1lg7FMP
— MS (@premchoprafan) February 3, 2019
2017లో జూన్ 4వ తేదీన జరిగిన జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో పాండ్యా ఇమాద్ వసీం బౌలింగ్‌లో మూడు సిక్సర్లతో హాట్రిక్ సిక్సర్ సాధించాడు. తరువాత అదే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మళ్లీ పాకిస్థాన్‌తోనే జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో రెండో సారి హ్యాట్రిక్ సిక్సర్ సాధించాడు. ఇక అదే ఏడాది ఆగస్టు 13న శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పుష్పకుమార స్పిన్ బౌలింగ్‌లో పాండ్యా మరోసారి 6, 6, 6 సాధించాడు. అనంతరం సెప్టెంబర్‌లో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో స్పిన్నర్ ఆడం జంపా బౌలింగ్‌లోనూ పాండ్యా హ్యాట్రిక్ సిక్సర్ సాధించాడు. తరువాత ఇప్పుడు న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌లో పాండ్యా 5వ సారి హ్యాట్రిక్ సిక్సర్ చేశాడు. ఈ క్రమంలో ఇవాళ్టి మ్యాచ్‌లో పాండ్యా కొట్టిన హ్యాట్రిక్ సిక్సర్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది..!