మరుసటి రోజు ఆఫ్ ఉంటే.. ముందు రోజు రాత్రి త్వరగా నిద్రపట్టదు. ఎలాగూ రేపు ఆఫే కదా.. కాసేపు టీవీ చూస్తాం, మూవీకి వెళ్దాం అనుకుంటారు. అలాగే పనిలేనిరోజు కూడా నిద్రటైమ్‌లో మార్పులు వస్తాయి. ఇలా ఒక నిర్దిష్ట టైమ్‌లో కాకుండా.. ఇష్టం వచ్చినట్లు పడుకోవడం వల్ల నిద్రసైకిల్ దెబ్బతినడమే కాకుండా చాలా సమస్యలు వస్తాయట. పేగుల్లో ఉండే బాక్టీరియాకు అనారోగ్యం వాటిల్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
సోషల్ జెట్‌లాగ్ అంటే ఏంటి..
ఏంటీ ఈ పేరు వెరైటీగా ఉందా అనుకుంటున్నారా..? ఏం లేదండీ.. వారాంతంతో పోలిస్తే వారంలో నిద్ర పోయే సమయాలు, నిద్ర లేచే సమయాల్లో తేడా ఉండటమే సోషల్ జెట్‌లాగ్ అంటారు. పని ఉన్న రోజుల్లో ఒకలాగా, పనిలేని రోజుల్లో ఒక రకంగా నిద్రపోతుంటారు. మనలో చాలామంది ఇదే అలవాటును ఫాలో అవుతారు. అరే ఆఫీస్ లేని రోజు కూడా ఎందుకు త్వరగా నిద్రపోవడం.. ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఒకే రకమైన నిద్రా సమయాలను పాటించరు.
నిద్ర సమయాలలో బాగా ఆటంకం ఏర్పడే వారికి ముఖ్యంగా షిఫ్ట్ వర్క్‌లలో పనిచేసే వారికి ఆరోగ్యంపై సోషల్ జెట్‌లాగ్ ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. నిద్రపోయే సమయం, నిద్రలేచే సమయం ఒకే విధంగా ఉండేలా చూసుకోవడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడం వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుంది. ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకుంటే అలారం కూడా అక్కర్లేదు.మీరు ఎంత నిద్రలో ఉన్నా.. కరెక్టుగా ఆ టైమ్‌కు సినిమా టైమ్ అయింది ఇంక బయటకు వెళ్లండి అన్నట్లు.. మీరు మేలుకుంటారు.
కింగ్స్ కాలేజీ లండన్ సైంటిస్ట్‌లు సుమారు వెయ్యి మందిపై ఈ అధ్యయనం చేపట్టారు. సాధారణంగా ఒక వారంలో మీరు రాత్రి నిద్ర పోయే సమయాల్లో 90 నిమిషాలు తేడా వచ్చినా పేగుల్లోని బ్యాక్టీరియా ప్రభావితమయ్యే ప్రమాదముందని వారు గుర్తించారు. మీ జీర్ణ వ్యవస్థలో వివిధ రకాల బ్యాక్టీరియాలు ఉండటం చాలా అవసరం. పలు రకాల వ్యాధులు రాకుండా శరీరం సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సరైన బ్యాక్టీరియాల కలయిక అనేది చాలా ముఖ్యం.
సోషల్ జెట్‌లాగ్ అనేది మీ ఆరోగ్యానికి అంతగా సహకరించని మైక్రోబయోటా జాతులను ఉత్పత్తి అయ్యేలా చేస్తుందని హెల్త్ సైన్స్ కంపెనీ జోయ్ సీనియర్ న్యూట్రిషియన్ సైంటిస్ట్, ఈ అధ్యయన రచయిత కేట్ బెర్మింగ్హం చెప్పారు. బ్రిటన్‌లో 40 శాతం మందికి పైగా జనాభాపై సోషల్ జెట్‌లాగ్ ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనం తెలిపింది. టీనేజర్లు, కాస్త పెద్దవారిలో ఇది కామన్‌గా ఉందట. వయసు పెరిగే కొద్ది ఇది తగ్గిపోతుంది.
అధ్యయనం ఎలా చేశారంటే..
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి నిద్రపోయే సమయాలను, రక్త నమూనాలను పరిశీలించారు. వారు తినే ఆహారాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు.
సోషల్ జెట్‌లాగ్‌తో ఉన్న వారు ఎక్కువగా బంగాళదుంపల క్రిస్ప్స్‌ను, చిప్స్‌ను తిన్నారు. షుగరీ డ్రింక్స్‌ను తీసుకున్నారు. అయితే, పండ్లు, నట్స్ ఉన్న ఆహారాన్ని మాత్రం వారు తక్కువగా తీసుకున్నారు.
సోషల్ జెట్‌లాగ్ వల్ల బరువు పెరగడం, అనారోగ్యం పాలవడం, మానసిక అనారోగ్యం వంటివి తలెత్తుతున్నట్లు ఇతర అధ్యయనాలు గుర్తించాయి. సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆహార ఎంపికలపై కూడా ప్రభావం పడుతుంది. ఈ వ్యక్తులకు ఎక్కువగా షుగరీ ఫుడ్స్‌ను ఎంచుకుంటారట. దీని వల్ల పేగులలోని నిర్దిష్టమైన బ్యాక్టీరియా స్థాయులపై ప్రభావం చూపుతుంది.
సోషల్ జెట్‌లాగ్ గ్రూప్ వ్యక్తుల పేగుల్లో ఎక్కువగా ఆరు రకాల మైక్రోబయోటా జాతులు ఉంటాయని పరిశోధకులు చెప్పారు. వీటిలో మూడు రకాల వల్ల సరైన ఆహారం తీసుకోలేకపోవడం, ఊబకాయం, కడుపులో మంట, స్ట్రోక్ ముప్పు తలెత్తవచ్చని పరిశోధకులు గుర్తించారు.
స్లీపింగ్ సైకిల్ చాలా ముఖ్యం. ఒక మనిషి ఆరోగ్యంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. రోజూ ఒకే సమయానికి నిద్ర పోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. అలాగే రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి, ఫ్యాట్ ఉన్న ఆహారాలను తగ్గించి, ఆకుకూరలు, పండ్లు డైలీ మెనూలో ఉండేలా చూసుకోండి. బీన్స్, చేపలు, గుడ్లు కూడా తరచూ తినాలి. ఇలాంటి హెల్తీ లైఫ్‌స్టైల్‌ను పాటిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యల భారిన పడకుండా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.