ముఖానికి ఆవిరి పెడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మొదటికే మోసం

-

ఫేస్‌కు ఆవిరిపట్టడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మొఖం మీద ఉండే ఓపెన్ పోర్స్‌ పోతాయి. స్కిన్‌ కూడా టైట్‌ అవుతుంది. కానీ సరిగ్గా ఆవిరిపట్టకపోతే.. చర్మం కమిలిపోయి, నిర్జీవంగా తయారవుతుంది. అందుకే ఆవిరిపట్టే విషయంలో తప్పొప్పుల గురించి తెలుసుకోండి.

ఏం చేయవచ్చు :

ఆవిరి పట్టుకోవాలని అనుకుంటే ముందుగా ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. జిడ్డు లేకుండా చూసుకోవాలి. ముఖంపై మేకప్‌ ఉంటే దాన్ని తీసివేసి చన్నీళ్లతో ముఖం కడుక్కోవాలి. అలా ముఖాన్ని క్లీన్‌ చేసుకున్న తర్వాత మాత్రమే ఆవిరి పట్టుకోవాలి.

ముఖంపైన మాత్రమే ఆవిరి బాగా పట్టుకోవాలనుకున్నప్పుడు ఒక దుప్పటి లాంటి దాన్ని తీసుకుని ముసుగులా వేసుకోండి. లోపల ఆవిరి పట్టుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

వేడి నీటి ఆవిరి 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే పెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ సేపు పెట్టుకోకూడదు. ముఖానికి మరీ అతి వేడి తగలకుండా చూసుకోవాలి.

 

తర్వాత ముఖాన్ని మెల్లగా సున్నితమైన కాటన్‌ వస్త్రంతో తుడుచుకోవాలి. తర్వాత ఏదో ఒక ఫేస్‌ ప్యాక్‌ వేసుకోవడం తప్పనిసరి. దీని వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.

ఫేస్‌ ప్యాక్‌ తీసేశాక మాయిశ్చరైజర్‌ని రాసుకోవడం వల్ల ఆ తర్వాత చాలా సమయం పాటు ముఖం తేమగా ఉంటుంది.

ఇలా చేయకండి..

చాలా ఎక్కువ సేపు ఆవిరి పట్టుకోకూడదు. పావు గంటకు కంటే ఎక్కువ సేపు ఆవిరిపట్టకండి.

అలాగే ప్రతి రోజూ ఈ పని చేయడమూ ప్రమాదమే. తరచుగా ఆవిరి పెట్టుకోవడం వల్ల చర్మం పొడిబారిపోయి, దురదలు రావడం లాంటి సమస్యలు మొదలవుతాయి.

సున్నిత చర్మం ఉన్న వారు తక్కువ వేడి ఉన్న నీటితో మాత్రమే ఆవిరి పెట్టుకోవాలి.

కొందరు నీళ్లను స్టౌ పై పెట్టి అవి మరుగుతున్నప్పుడు ఆవిరి పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా నేరుగా ఎప్పుడూ ఆవిరి పట్టుకోకూడదు. ఒక్కోసారి అనుకోకుండా ఎక్కువ ఉష్ణోగ్రత తగిలి ముఖం కమిలిపోయే అవకాశాలుంటాయి.

ఆవిరి పట్టుకున్న తర్వాత ముఖం మరింత సున్నితంగా తయారవుతుంది. కాబట్టి వెంటనే అతి నీల లోహిత కిరణాలు తాకకుండా చూసుకోవాలి.

స్టీమింగ్‌ తర్వాత ఎండలోకి వెళ్లాల్సి వస్తే కచ్చితంగా మంచి సన్‌స్క్రీన్‌ లోషన్‌ని రాసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news