సాధారణంగా పిల్లలలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల తరచూ అనారోగ్యం పాలవుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు తరచూ వస్తూ ఉంటాయి. మరి పిల్లలలో రోగనిరోధక శక్తిని ఎలా పెంపొందించాలి? వారికి ఎలాంటి ఆహారం ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది? అయితే మన ఇంట్లో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలను పిల్లలకు తినిపించడం ద్వారా రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. మరి ఆ పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
సిట్రస్ జాతికి చెందిన పండ్లను అంటే బత్తాయి, నారింజ పండ్లను పిల్లలకు తరచూ తినిపించడం ద్వారా ఇందులో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, జలుబు దగ్గు వంటి సమస్యలు రాకుండా నియంత్రిస్తుంది.
పిల్లలకు ప్రతిరోజు డ్రైఫ్రూట్స్ తినిపించడం ద్వారా వారి శరీరానికి ఎంతో బలం చేకూరుతుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వదు.
పిల్లలకు విటమిన్ ఏ, జింక్ సమృద్ధిగా లభించాలంటే క్యారెట్ తినిపించడం ఎంతో మంచిది. క్యారెట్ జ్యూస్, క్యారెట్ హల్వా ఇలా ఏదో ఒక రూపంలో తినిపించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్లకు దారి తీయదు. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండడం వల్ల ఎటువంటి కంటి సమస్యలు లేకుండా కంటి చూపు మెరుగు గా ఉంటుంది.
చిన్నారులకు నిత్యం పెరుగును కచ్చితంగా తినిపించాలి. ఇందులో ఉన్న బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా పెరుగులో ఉండే క్యాల్షియం ఎముకలకు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది.
ఇటువంటి సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను తరచూ ఇవ్వడం ద్వారా రోగనిరోధకశక్తి పెరగడమే కాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు.