ఈరోజుల్లో బరువు తగ్గేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. జిమ్ చేయడం, డైట్ ఫాలో అవడంతో పాటు కొన్ని ఇంజెక్షన్ల ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. అయితే బరువు తగ్గేందుకు తీసుకునే ఇంజక్షన్ల వల్ల చాలా ప్రమాదం ఉందని, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. బరువు తగ్గడానికి తీసుకునే కొన్ని ఇంజెక్షన్ల వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు, స్వీయహాని ఆలోచనలు కలిగే ప్రమాదం ఉందట.
ఈఎంఏ సభ్య దేశం ఐస్‌లాండ్ ఇలాంటి మూడు కేసులను గుర్తించింది. వెగోవీ, సాక్సెండా, ఓజెంపిక్ వంటి ఆకలిని మందగింపజేసే మందుల సేఫ్టీ అసెస్‌మెంట్ చేయనున్నట్లు ఈఎంఏ చెప్పింది. ఇలాంటి మందులను విక్రయించే సంస్థలు తమ ఔషధాలతో పాటు ఇచ్చే కరపత్రాలలో ప్రస్తావించిన ‘పాజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్’లో ఆత్మహత్య ఆలోచనలను కూడా చేర్చాయి. తొలుత ఈ ఏజెన్సీ సెమాగ్లుటైడ్ కానీ లిరాగ్లుటైడ్ కానీ ఉండే వెయిట్ లాస్ మందుల వల్ల కలిగే నష్టాలను అంచనా వేయనుంది.
సెలబ్రిటీలు, ఇతర వ్యక్తులు బరువు తగ్గడంపై సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఇలాంటి బరువు తగ్గించే చికిత్సలకు డిమాండ్ పెంచుతున్నాయని నిపుణులు అంటున్నారు..వెయిట్ లాస్ చికిత్సల కోసం సాక్సెండా, వెగోవీ మందులకు ఆమోదం, లైసెన్స్లు ఉన్నాయి. బ్రిటన్‌లో వెగోవీ ఇంకా అందుబాటులోకి రాలేదు.
ఓజెంపిక్‌ను మధుమేహ రోగుల్లో చక్కెర స్థాయి, బరువును నియంత్రించడానికి ఉఫయోగిస్తారు. అయితే, ఇందులో వెగోయిలో ఉన్నట్లే సెమాగ్లుటైడ్ తక్కువ మోతాదులో ఉంటుంది. అయితే, మధుమేహం లేనివారు కూడా కొందరు బరువు తగ్గడం కోసం ఈ ఇంజెక్షన్ వాడుతుండడంతో కొరత ఏర్పడుతోంది.
బరువు తగ్గిస్తాయని చెప్పే మందులతో కలిగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..
వికారం
వాంతులు
తలనొప్పి
మలబద్దకం
కడుపునొప్పి
అలసిపోవడం
ఓజెంపిక్ ఔషధంతో పాటు ఇచ్చే కరపత్రంలో కుంగుబాటు, ఆత్మహత్య ఆలోచనలు వంటివి కలగొచ్చని రాశారు.
అన్ని మందులకూ ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఎక్సర్‌సైజ్ అవసరం. కాబట్టి ముందు బరువు పెరగకుండానే తగిన విధంగా ఆహారం మీద శ్రద్ధ పెట్టాలి. ఇప్పటికే బరువు ఉన్నవారు తగ్గేందుకు మంచి జీవనశైలిని పాటిస్తూ ప్రాక్టికల్‌గా, పర్టిక్యులర్‌గా ఉండండి. ఏ ప్రయత్నమైనా రెండు రోజులు చేసి మానేయడం కాకుండా ఒక దీక్షలా చేస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు.