విద్యార్థులపై సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. టైఫాయిడ్, మలేరియా, డెంగీ వ్యాధులతో చిన్నారులు సతమతమవుతున్నారు. తాజాగా.. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలోని దుబ్బాక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో శుక్రవారం 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజుల నుంచి వీరంతా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో అక్కడ వైద్యశిబిరం ఏర్పాటు చేసి 60 మందికి పరీక్షలు చేశారు.
40 మంది అస్వస్థతకు గురి కాగా.. వారిలో 12 మందిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారికి గురుకుల పాఠశాలలోనే చికిత్స అందిస్తున్నారు. స్థానిక ఎంపీపీ సాయిలు, తెరాస మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ సత్యనారాయణ విద్యార్థుల్ని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యసిబ్బందిని కోరారు.