కరోనా నేపథ్యంలో ఇప్పటికీ చాలా మంది వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. గతేడాది మార్చి నుంచి మన దేశంలో లాక్ డౌన్ ప్రారంభం కాగా మే నెల చివరి నుంచి ఆంక్షలను సడలిస్తూ వస్తున్నారు. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గనందున అనేక కంపెనీలు ఉద్యోగులకు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండడం వల్ల 100లో 90 మంది ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఓ సర్వేలో వెల్లడైంది.
ఓ సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం ప్రతి 1000 మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల్లో 90 శాతం మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వెల్లడైంది. ఇక వారిలో 8 గంటల కన్నా ఎక్కువ సేపు కంప్యూటర్ల ఎదుట కూర్చుంటున్న వారి శాతం 90 కన్నా ఎక్కువగా ఉందని తేలింది. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఉద్యోగులు తెలిపారు. ముఖ్యంగా వారిలో 39 శాతం మందికి స్టిఫ్ నెక్ సమస్య వస్తుందని చెప్పగా, 53 శాతం మందికి బ్యాక్ పెయిన్, 44 శాతం మందికి నిద్రలేమి, 34 శాతం మందికి చేతి నొప్పులు, 33 శాతం మందికి కాళ్ల నొప్పులు, 27 శాతం మందికి తలనొప్పి, కంటి సమస్యలు వస్తున్నాయని తెలిపారు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఉద్యోగుల్లో అనేక ఆందోళనలు నెలకొంటున్నట్లు వెల్లడైంది.
అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా, ఆఫీసులకు వెళ్లి పనిచేసినా నిత్యం శారీరక శ్రమ ఉండాలని వైద్య నిపుణులు తెలిపారు. నిత్యం వ్యాయామం చేయడం వల్ల పైన తెలిపిన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని, అలాగే మానసికంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని అంటున్నారు.