ఇలా పడుకుంటే మంచిదట!

జీవితంలో సగభాగం మనం నిద్రకే కేటాయిస్తాం. ఒకరోజు నిద్ర పోకున్నా ఏ యాక్టివిటీస్‌ చేయలేం. అలా మనం నిద్రకు ప్రాముఖ్యతనిస్తాం. అయితే, మీకు తెలుసా? అసలు మనం ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిదో? ఇది చాలా మందికి తెలియని విషయం. మనం నిద్రపోయే విధానాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందట. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది కచ్చితమై ప్రభావం చూపుతుంది.

ప్రతిరోజూ మనం నిద్రపోయేటప్పుడు ఎలాపడితే అలా పడుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం. కనీసం రోజుకు ఆరు గంటలైనా పడుకోవాలి. ఆ నిద్ర కూడా కంఫర్టుగా ఉండాలి. అంటే కుర్చీలోనో, సోఫాలోనో నిద్రపోతే, అది సరైన నిద్ర కాదు. బెడ్‌పై లేదా నేలపై పడుకున్నప్పుడే సరైన నిద్ర అవుతుంది. పగటివేళ పనులు చేసుకునేటప్పుడు నిద్ర వస్తే, వారు రాత్రిపూట సరిగా నిద్రపోవట్లేదని అర్థం. అప్పుడు నిద్ర సమయాన్ని కాస్త పెంచుకోవాలి.
అయితే, పడుకునేటపుడు ఎటువైపు తిరిగి, ఏ యాంగిల్‌ నిద్రపోతే మంచిదో తెలుసుకుందాం.

  • పొట్టను పైకి ఉంచి పడుకునేవారు అదృష్టవంతులు. ఆడ, మగ ఎవరైనా ఇలా పడుకోవడం మంచి విధానం. దీని వెల్ల వెన్నెముక సరిగ్గా ఉంటుంది. మెడ, వెనక భాగం దగ్గర కొంత అసౌకర్యంగా ఉంటుంది. అక్కడి కండరాలు ఇబ్బంది పడతాయి. అయినప్పటికీ ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖంపై ముడుతలు రావు. ముఖ్యంగా మహిళలకు ఇది చక్కటి పొజిషన్‌. వక్షోజాలు కూడా దెబ్బతినకుండా పటిష్టంగా ఉంటాయి.
  • రెండో విధానం ఎడమవైపు తిరిగి పడుకోవడం. ఈ పొజిషన్‌లో చాలా ఎక్కువ మంది నిద్రపోతారు. ఇలా పడుకున్నప్పుడు తిన్న ఆహారం చక్కగా అరుగుతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు రావు. కాకపోతే ఎడమ భుజంలో నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొద్ది సేపు ఇలా పడుకోవచ్చు గానీ… రాత్రంతా ఇలా పడుకోవడం మంచిది కాదు.
  • ఇక కుడివైపుకి తిరిగి పడుకోవడం అత్యంత ప్రమాదకరం. అలా పడుకునేవారికి ఆహారం సరిగా జీర్ణం కాదు. గుండెలో నొప్పి కూడా వస్తుంది.
  • పొట్టను నేలపై ఆనించి నిద్రపోవడం కొంత మందిలో కనిపిస్తూ ఉంటుంది. అలా పడుకోవడం పూర్తిగా అనారోగ్యకరం. దాని వల్ల తలను అటో, ఇటో ఎటో ఒకవైపు తిప్పి పడుకోవాల్సి వస్తుంది. దాంతో మెడనొప్పి వస్తుంది. వెన్ను నొప్పి కూడా వస్తుంది. వెన్నుపూస ఓ పద్ధతి లేకుండా అయిపోతుంది.