మనిషి ఒత్తిడిని మనకంటే ముందు కుక్కలే పసిగడతాయంటున్న అధ్యయనాలు..!!

-

మనుషుల కంటే మూగజీవులకే ప్రేమ అనురాగాలు ఎక్కువగా ఉంటాయని వాటిని ప్రేమించే వారు బాగా నమ్ముతారు. అందులో కుక్కలు ఇంకా విశ్వాసంగా ఉంటాయి. మనం ఒత్తిడి, టెన్షన్‌లో ఉన్నామన్న సంగతి మనకు కూడా కొన్నిసార్లు తెలియదు. కానీ, కుక్కలు మన చెమట వాసన, శ్వాస నుంచి ఒత్తిడిని పసిగడతాయని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

కుక్కలు అత్యంత సున్నితమైన, సహజ జ్ఞానం కలిగిన జంతువులని మరోసారి నిరూపితమైంది. యూకేలోని బెల్‌ ఫాస్ట్‌ నగరం నుంచి ‘ట్రియో, ఫింగల్, సూట్, విన్నీ’ అనే నాలుగు కుక్కలతో సహా మొత్తం 36 మంది మనుషులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. అధ్యయనంలో భాగంగా ఒక కష్టమైన గణిత సమస్యను ఇవ్వడానికి ముందు, ఆతర్వాత పార్టిసిపెంట్స్‌ నుంచి చెమట, శ్వాస నమూనాలను సేకరించారు. అలాగే ఈ సమస్యను సాల్వ్‌ చేసే ముందు, తర్వాత సదరు వ్యక్తుల రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరిగిన నమూనాలను శాస్త్రవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు.

ప్రతి పరీక్షా సెషన్‌లో ఒక్కో కుక్కకు ఒక వ్యక్తికి సంబంధించి నాలుగు నిమిషాల వ్యవధిలో తీసుకున్న రిలాక్స్‌డ్, ఒత్తిడితో కూడిన నమూనాలు ఇవ్వబడ్డాయి. ఈ సమయంలో కుక్కలన్నీ ప్రతి వ్యక్తి స్ట్రెస్ శాంపిల్‌కు సరిగ్గా హెచ్చరించగలిగాయని పరిశోధకులు వెల్లడించారు…

‘మానవులు ఒత్తిడికి లోనైనప్పుడు చెమట, శ్వాస ద్వారా భిన్నమైన వాసనలు వస్తాయని పరిశోధనలో తేలింది. రిలాక్స్‌గా ఉన్నప్పుడు మన వాసన వేరుగా ఉంటుందని కుక్కలు పసిగడతాయట… కానీ, కొన్నిసార్లు మనకు కూడా తెలియదని బెల్‌ఫాస్ట్‌లోని క్వీన్‌ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి క్లారా విల్సన్‌ తెలిపారు.

కుక్కలకు తెలియని వ్యక్తి అయినా సరే ఈ వాసనలను గుర్తించగలవని పరిశోధకులు అంటున్నారు.. కాగా సర్వీస్ డాగ్స్, థెరపీ డాగ్స్ శిక్షణలో ఈ ఫలితాలు సాయపడతాయని రీసెర్చర్స్‌ పేర్కొన్నారు. అంతేకాదు మనిషితో కుక్కల సంబంధాన్ని మరింత వెలుగులోకి తెచ్చేందుకు ఈ అధ్యయనం దోహదపడుతుందంటున్నారు. కుక్కలను పెంచడం అంటే.. ఒక బిడ్డను పెంచినట్లే.. మాట్లాడటం ఒక్కటి తప్ప అది మనపై అంతే ప్రేమ చూపిస్తుంది, అలుగుతుంది, కోపడుతుంది. అన్నీ హావభావాలు చూపిస్తుంది. మీరు కనపడకపోతే మిస్‌ అవుతుంది. కుక్కలను ఇష్టపడే వారు మాత్రమే వాటి ప్రేమను అర్థంచేసుకోగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news