జీవక్రియ సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తుంటాయి. భౌతికంగా, మానసికంగా రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే జీవక్రియ సక్రమంగా ఉండాలి. ఆహారం జీర్ణం అవడం దగ్గర నుండి ఆ జీర్ణమైన ఆహారం శరీర జీవకణాల్లో శక్తిని ఇవ్వడం వరకు జీవక్రియ సరిగ్గా ఉండాలి. లేదంటే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. ఐతే జీవక్రియ సరిగ్గా ఉండకపోవడానికి చాలా కారణాలున్నాయి. వాటిల్లో ఒత్తిడి, సరైన సమయానికి ఆహారం తినకపోవడం, భోజనానికి భోజనానికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడం మొదలగునవి.
అందుకే తినే సమయంలో తినాలి. పని చేసే సమయంలో పని చేయాలి. పని ఎక్కువగా ఉందని తినడం మానేస్తే దాని ప్రభావం శరీరం మీద పడి అనేక సమస్యలను ముందుకు తీసుకువస్తుంది.
మీ జీవక్రియ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ కింద లక్షణాలు చూడండి.
ఆహారం తినకపోయినా కడుపు నిండుగా ఉన్నట్టు అనిపించడం. దానివల్ల సరిగ్గా తినాలనిపించకపోవడం.
నోటిని శుభ్రంగా ఉంచుతున్నప్పటికీ దుర్వాసన రావడం.
అమాంతం బరువు తగ్గడం లేదా పెరగడం వంటి ఇబ్బందులు ఏర్పడడం.
వారంలో చాలా రోజులు శక్తి లేనట్టుగా ఉండడం.
మలబద్దకంతో ఇబ్బంది లేదా ఎక్కువగా మోషన్స్ అవుతూ ఉండడం.
మహిళల్లో అయితే క్రమం తప్పి రుతుస్రావం జరగడం.
నల్ల మచ్చలు వంటి చర్మ సమస్యలు తలెత్తడం, వాటికి మందులు వాడినా కూడా అవి తగ్గకపోవడం.
ఈ లక్షణాలు మీలో కనిపించినట్లయితే మీ జీవక్రియలో ఏదో లోపం ఉందన్నమాట. జీవక్రియ సరిగ్గా ఉన్నవారికి సరైన నిద్ర, మెరిసే చర్మం, మృదువైన జుట్టు, తక్కువ ఒత్తిడి మొదలగు లక్షణాలు ఉంటాయి.