ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముందస్తు లక్షణాలివే! సంకేతాలు గుర్తించలేదంటే.. పురుషుల్లో ఆ సమస్య

మనదేశంలో కాన్సర్ బాధితులు ఎక్కువే..అందులోనూ పురుషుల్లో ఎక్కువగా వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ సంఖ్య కూడా అధికంగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ కాన్సర్ రావటానికి ఒకటే రీజన్ ఉండదు..వివిధ రకాల కారణాల వల్ల ఇది విస్తరిస్తుంది. ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేకపోవటం కూడా ఇది పెరగటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అవును ఇలాంటి కాన్సర్ లక్షణాలను త్వరగా గుర్తిచలేక..తుదిదశలో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రోస్టేట్‌ కేన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత ఎక్కువగా చికిత్స విజయవంతం అయే అవకాశాలు ఉంటాయట. అపోలో ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్‌ ఆండ్రాలజిస్ట్‌–యూరాలజిస్ట్‌ డా.ప్రియాంక్‌ సలేచా ఈ వ్యాధికి సంబంధించిన పలు విశేషాలు, నివారణ మార్గాలను తెలిపారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలో ఉండే ఒక అవయవం ప్రోస్టేట్‌. ఇది శరీరపు మూత్ర విసర్జన విధులకు అనుసంధానించి ఉంటుంది. అన్ని వయసుల వారికీ ప్రోస్టేట్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే 50 ఏళ్లు పై బడిన పురుషులు ఈ లక్షణాల పట్ల అవగాహన పెంచుకుని, ముందస్తు సూచికలను పసిగట్టాల్సి ఉంటుందట. అదే విధంగా తరచుగా ప్రోస్టేట్‌ పరీక్షలు చేయిస్తూ ఉండడం కూడా ప్రోస్టేట్‌ ఆరోగ్యం సవ్యంగా ఉంచేందుకు, తొలిదశలోనే ఏ వ్యాధినైనా అడ్డుకునేందుకు ఉపయోగపడతాయి.

ప్రోస్టేట్‌కు అనుబంధంగా వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఇన్‌ఫ్లమేషన్, ప్రోస్టేట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ బీపిహెచ్… ప్రోస్టేట్‌ కేన్సర్‌ వరకూ దారితీస్తాయి. లక్షణాలను గుర్తించేలోగానే ఒకవేళ కేన్సర్‌ ఇతర అవయవాలకు కూడా విస్తరించినట్లయితే చికిత్స చేయటం క్షిష్టంగా మారుతుంది. అందుకే ముందు దీనికి సంబంధించి డాక్టర్ ప్రియాంక్ సలేచా చెప్పిన లక్షణాలు ఏవిధంగా ఉంటాయో చూద్దాం.

లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

  • కేన్సర్‌ సోకి వృద్ధి చెందే దశలో లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, నుంచుని మూత్ర విసర్జన చేసేందుకు ఇబ్బంది పడడం, ధార బలహీనంగా పోవడం… వంటివి ఉంటాయి.
  • మూత్రంలో రక్తం కనపడడం అనేది రకరకాల వ్యాధులకు సూచిక అలాగే ప్రోస్టేట్‌ కేన్సర్‌కి కూడా ఇది ఒక సంకేతం లాంటిదే.. ఈ లక్షణం కనపడిందంటే.. కేన్సర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌కి చేరినట్టు అర్ధం.
  • పురుషుల పునరుత్పత్తికి సంబంధించి కీలకమైన అవయవం కాబట్టి, ప్రోస్టేట్‌… స్కలన సమయంలో నొప్పితో పాటు రకాల ఇబ్బందికర భావనలు వచ్చేందుకు కేన్సర్‌ కారకమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది అంగస్తంభన వైఫల్యాలకు కూడా దారి తీస్తుంది.
  • రాత్రి సమయంలో తరచు మూత్ర విసర్జన అవుతుంటుంది. ప్రొస్టేట్‌ అవయవం ఎన్‌లార్జ్‌ అవడం వల్ల యురేత్రా మీద అదనపు ఒత్తిడి కలిగించే అవకాశం ఉంది. తద్వారా మూత్ర విసర్జన సరఫరాకి అడ్డంకులు ఏర్పడి మూత్ర కోశం గోడల ఇరిటేషన్‌కు కారణమవుతుంది. ఈ పరిస్థితి తరచుగా రాత్రి సమయంలో చోటు చేసుకుంటుంది.
  • కేన్సర్‌ పెరుగుతున్న కొద్దీ… ప్రోస్టేట్‌ గ్లాండ్‌ మరింత ఎన్‌లార్జ్‌ అయి పురీష నాళంపై నిర్విరామంగా ఒత్తిడి కలిగిస్తుంది.

గమనిక: పైన పేర్కొన లక్షణాలు మాత్రమే కాకుండా ఏ విధమైన అసాధారణ మార్పులు కనపడినా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. కేన్సర్‌ స్టేజ్‌ మీద ఆధారపడి రేడియేషన్‌ థెరపీ, శస్త్ర చికిత్సలను నిపుణులు సూచిస్తారు.

– Triveni Buskarowthu