30 ఏళ్లు దాటితేనే కుయ్యో.. ముయ్యో.. అంటూ గులుగుతుంటారు నేటి యువత. 30 ఏళ్లకే ప్రపంచంలో ఎక్కడా లేని వ్యాధులు వస్తుంటాయి. ఇక మా పని అయిపోయింది అని అనుకుంటారు. 40 ఏళ్ల దాటితే ఇక ఖతం.. మేం దేనికీ పనికిరాం అని అనుకుంటారు. మరి.. ఈ బామ్మ చూడండి. వయసు ఎంతో తెలుసా కేవలం 102 ఏళ్లు. అంతే.. ఈ వయసులో స్కై డైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతే కాదు.. స్కైడైవింగ్ చేసిన అత్యంత పెద్ద వయసు ఉన్న వ్యక్తిగా రికార్డు కూడా సాధించిందండోయ్.
ఈమె పేరు ఇరెన్ ఓషియా. ఊరు దక్షిణ ఆస్ట్రేలియా. అక్కడే ఉన్న లాంగ్ హార్న్ క్రీక్ డ్రాప్ జోన్ అనే ప్రాంతంలో తన ట్రెయినర్ స్మిత్ తో కలిసి 14 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసింది. అయితే.. ఈ వయసులో బామ్మ ఇంత సాహసానికి పూనుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. మంచి కాజ్ ఉంది. మోటార్ న్యూరాన్ అనే ఓ విచిత్రమైన వ్యాధి ఆస్ట్రేలియాలో ఉంది లేండి. తన కూతురు కూడా ఆ వ్యాధికి గురై మరణించిందట. తన కూతురులాగా మరెవరూ కాకూడదని చెప్పి.. ఆ వ్యాధికి గురైన వారి చికిత్స కోసం విరాళాలు సేకరించడానికి ఈ బృహత్కార్యానికి పూనుకున్నదన్నమాట. స్కైడైవింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ వ్యాధికి గురైన వారి చికిత్సకు ఉపయోగిస్తుంది. ఇదివరకు 2016 లో కూడా ఈ బామ్మ స్కైడైవింగ్ చేసింది. అప్పుడు వచ్చిన డబ్బును ఆ వ్యాధి సోకిన వాళ్ల హాస్పిటల్ ఖర్చులను వినియోగించిందట. వావ్.. బామ్మ.. నువ్వు సూపరహె. నేటి యువత నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి బామ్మ.